ప్రశాంత్ త్యాగరాజన్ అంటే తెలుగు వారికి గుర్తుకు రావడం కొంచెం ఆలస్యం అవ్వొచ్చు. కానీ జీన్స్ మూవీ హీరో అంటే మాత్రం టక్కున గుర్తుకువస్తాడు. దర్శకనటుడు త్యాగరాజన్ తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగు పెట్టిన ప్రశాంత్.. 90వ దశకంలో తమిళనాట స్టార్ హీరోగా చక్రం తిప్పాడు. చాక్లెట్ బాయ్ ఇమేజ్ తో భారీ ఫ్యాన్ ఫాలోయింగ్ ను సొంతం చేసుకున్నాడు. జీన్స్ మూవీతో తెలుగు ప్రేక్షకులకు చేరువయ్యాడు.
తెలుగులో నేరుగా లాఠీ, ప్రేమ శిఖరం, తొలి ముద్దు తదితర చిత్రాల్లో ప్రశాంత్ యాక్ట్ చేశాడు. అయితే 2006 నుంచి ఎందుకో ప్రశాంత్ గ్రాఫ్ పడిపోతూ వచ్చింది. కొన్నాళ్లు ఇండస్ట్రీకి దూరంగా ఉన్న ప్రశాంత్.. 2015 నుంచి అడపా తడపా చిత్రాల్లో సహాయక పాత్రలను పోషించాడు. తెలుగులో వినయ విధేయ రామ లో రామ్ చరణ్ కు అన్నగా నటించి అలరించాడు.
రీసెంట్ గా ప్రశాంత్ ప్రధాన పాత్రలో తెరకెక్కిన అంధగన్ మూవీ తమిళంలో విడుదలై మంచి విజయం సాధించింది. అయితే అంధగన్ సక్సెస్ మీట్ లో ప్రశాంత్ రెండో పెళ్లి గురించి ఆయన తండ్రి త్యాగరాజన్ ఆసక్తికర కామెంట్స్ చేశారు. ప్రశాంత్ మళ్లీ పెళ్లి చేసుకోబోతున్నాడని.. అమ్మాయి కోసం వెతుకులాట మొదలుపెట్టామని త్యాగరాజన్ తెలిపారు. త్వరలోనే గుడ్ న్యూస్ చెబుతామని వెల్లడించారు. దీంతో ఇప్పుడీ మ్యాటర్ నెట్టింట వైరల్ గా మారింది.
కాగా, ప్రశాంత్ మొదట వి.డి గృహలక్ష్మిని 2005లో వివాహం చేసుకున్నాడు. ఈ దంపతులకు ఒక కుమారుడు కూడా ఉన్నాడు. అయితే గృహలక్ష్మితో ప్రశాంత్ బంధం ఎక్కువ కాలం సాగలేదు. పెళ్లి జరిగిన మూడేళ్లకే వ్యక్తిగత విభేదాలతో వీరు విడిపోయారు. అప్పటి నుంచి ప్రశాంత్ సింగిల్ గానే ఉన్నాడు. ఇక ఇప్పుడు 51 ఏళ్ల వయసులో ప్రశాంత్ సెకండ్ మ్యారేజ్ తో కొత్త లైఫ్ స్టార్ట్ చేసేందుకు సిద్ధం అవుతున్నాడు.