చాలాకాలం నుంచి వరుస పరాజయాలతో సతమతం అవుతున్న సూపర్ స్టార్ రజనీకాంత్.. గత ఏడాది జైలర్ మూవీతో స్ట్రాంగ్ కంబ్యాక్ ఇచ్చిన సంగతి తెలిసిందే. తాజాగా ఈ చిత్రం విడుదలై ఏడాది పూర్తి చేసుకుంది. ఈ సందర్భంగా జైలర్ విశేషాలు మరోసారి సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతున్నాయి. నెల్సన్ దిలీప్‌కుమార్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రాన్ని రూ. 200 కోట్ల బడ్జెట్ తో సన్ పిక్చర్స్ పతాకంపై కళానిధి మారన్ నిర్మించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.
అలాగే ఈ మూవీలో వినాయకన్, వసంత్ రవి, రమ్యకృష్ణ, మర్నా మీనన్ తదితరులు కీలక పాత్రలను పోషించగా.. తమన్నా స్పెషల్ సాంగ్ లో మెరిసింది. మోహన్‌లాల్, శివ రాజ్‌కుమార్, జాకీ ష్రాఫ్ అతిథి పాత్రల్లో కనిపించారు. భారీ అంచనాల నడుమ 2023 ఆగస్టు 10న విడుదలైన జైలర్.. పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. ఎటువంటి లవ్ ట్రాక్, రొమాంటిక్ సాంగ్స్ లేకపోయినా.. బొమ్మ బ్లాక్ బస్టర్ అయింది. ఫుల్ రన్ లో రూ. 650 కోట్ల రేంజ్ లో వసూళ్లను కొల్లగొట్టింది.
జైలర్ తో రజనీకాంత్ చాలా ఏళ్ల తర్వాత బిగ్ హిట్ ను ఖాతాలో వేసుకున్నారు. ఇక్కడ ఇంట్రెస్టింగ్ విషయం.. జైలర్ కి ఫస్ట్ ఛాయిస్ రజనీకాంత్ కాదు. మొదట ఓ తెలుగు హీరోతో ఈ సినిమాను చేయాలని అనుకున్నారు. ఆ హీరో మరెవరో కాదు మెగాస్టార్ చిరంజీవి. డైరెక్టర్ నెల్సన్ ముందుగా జైలర్ స్టోరీని చిరంజీవికి వినిపంచారట. పాటలు, ఫైట్లు పెద్దగా లేకపోవడం వల్ల చిరంజీవికి కథ అంతగా నచ్చలేదట.
అందువల్ల మెగాస్టార్ సున్నితంగా రిజెక్ట్ చేయడం జరిగింది. దాంతో డైరెక్టర్ నెల్సన్ మరో ఆప్షన్ లేకుండా అదే కథతో రజనీకాంత్ వద్దకు వెళ్లి ఆయన్ను ఒప్పించారు. జైలర్ ను తెరకెక్కించాడు. కట్ చేస్తే.. సినిమా ఎవరూ ఊహించని రేంజ్ లో విజయాన్ని నమోదు చేసింది. నిర్మాత కళానిధి మారన్ కు భారీ లాభాలను తెచ్చుకుంది. సినిమా సక్సెస్ తర్వాత కళానిధి మారన్.. డైరెక్టర్ నెల్సన్ మరియు హీరో రజనీకాంత్ లకు లగ్జరీ కార్లను గిఫ్ట్ గా ఇవ్వడం విశేషం.