పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ మూవీ వర్షం. శోభన్ డైరెక్ట్ చేసిన ఈ రొమాంటిక్ యాక్షన్ మూవీలో ప్రభాస్ కు జోడిగా చెన్నై సోయగం త్రిష నటించింది. ప్రతినాయకుడిగా పాత్రను గోపీచంద్ పోషించగా.. ప్రకాష్ రాజ్, పరుచూరి వెంకటేశ్వరరావు, చంద్రమోహన్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రల్లో నటించారు. దేవి శ్రీ ప్రసాద్ సంగీతం అందించారు.
సుమంత్ ఆర్ట్ ప్రొడక్షన్స్ బ్యానర్ పై ఎంఎస్ రాజు నిర్మించిన వర్షం చిత్రం.. 2004 జనవరి 14న విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. ప్రభాస్ కెరీర్ లో తొలి రెండు చిత్రాలైన ఈశ్వర్, రాఘవేంద్ర అంతగా ఆడలేదు. కానీ వర్షం మూవీ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. ప్రభాస్ ను హీరోగా ఇండస్ట్రీలో నిలబెట్టింది.
125 కేంద్రాలలో 50 రోజులు, 95 కేంద్రాలలో 100 రోజుల రన్ మరియు 24 కేంద్రాలలో 175 రోజుల రన్ జరుపుకుంది. మూడు నందిలతో సహా అనేక పురస్కారాలను సొంతం చేసుకుంది. అయితే ఈ సినిమాలో హీరో క్యారెక్టర్ కు ప్రభాస్ ఫస్ట్ ఛాయిస్ కాదన్న సంగతి మీకు తెలుసా..? డైరెక్టర్ శోభన్ ప్రభాస్ కన్నా ముందు మరొక హీరోతో వర్షం మూవీని చేయాలని భావించాడట. ఇంతకీ ఆ హీరో మరెవరో కాదు టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు.
వర్షం స్టోరీ మొట్టమొదట మహేష్ బాబు వద్దకే వెళ్లిందట. కానీ కథ అంతగా నచ్చకపోవడంతో మహేష్ బాబు సన్నితంగా తిరస్కరించాడు. అయితే ఆ తర్వాత అదే స్టోరీని శోభన్ ప్రభాస్ వద్దకు తీసుకెళ్లగా.. ఆయనకు కథ నచ్చి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడు. కట్ చేస్తే వర్షం బ్లాక్ బస్టర్ హిట్ అయింది. ప్రభాస్ కు భారీ స్టార్డమ్ తెచ్చిపెట్టింది.