69వ శోభ ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ సౌత్ -2024 వేడుక శనివారం రాత్రి హైదరాబాద్‌లోని జేఆర్సీ కన్వెన్షన్ వేదికగా ఎంతో వైభవంగా జరిగింది. సందీప్ కిషన్, ఫరియా అబ్దుల్లా, వింద్య హోస్ట్ చేసిన ఈ అవార్డుల మహోత్సవంలో తెలుగు, తమిళ్, కన్నడ, మలయాళ చిత్ర పరిశ్రమలకు చెందిన ప్రముఖులు సందడి చేశారు. కొందరు తారలు తమ డాన్స్ పర్ఫామెన్స్ తో ఆహుతులను విశేషంగా అలరించారు.
ఇకపోతే ఫిల్మ్‌ఫేర్ అవార్డ్స్ 2024లో తెలుగు చిత్రం బలగం సత్తా చాటింది. ఎటువంటి అంచనాలు లేకుండా వచ్చిన ఈ చిన్న సినిమా సంచలన విజయాన్ని నమోదు చేసింది. కోట్లాది ప్రేక్షకుల హృదయాలను దోచుకుంది. తాజాగా ఉత్తమ చిత్రంగా నిలిచి ఫిల్మ్‌ఫేర్ అవార్డును సైతం కైవసం చేసుకుంది. అలాగే బలగం సినిమాను తెరకెక్కించిన వేణు యెల్దండి ఉత్తమ దర్శకుడిగా అవార్డు అందుకున్నాడు.
దసరా సినిమాలో తమ అద్భుతమైన నటనతో రంజింపజేసిన హీరో నాని ఉత్తమ నటుడిగా, హీరోయిన్ కీర్తి సురేష్ ఉత్తమ నటిగా ఫిల్మ్‌ఫేర్ పురస్కారాన్ని సొంతం చేసుకున్నారు. ఉత్తమ సహయ నటుడు(మేల్)గా వాల్తేరు వీరయ్య చిత్రానికి గానూ మాస్ మహారాజా రవితేజ, రంగ మార్తాండ సినిమాకు గానూ బ్రహ్మానందం అవార్డు అందుకున్నారు. ఉత్తమ సినిమా(క్రిటిక్స్)గా బేబీ ఫిల్మ్‌ఫేర్ దక్కించుకుంది. ఉత్తమ నటుడు(క్రిటిక్స్)గా మిస్ శెట్టి, మిస్టర్ పోలిశెట్టి మూవీకి గానూ నవీన్ పోలిశెట్టి, రంగ మార్తాండ సినిమాకు గానూ ప్రకాశ్ రాజ్ అవార్డ్స్ అందుకున్నారు. ఉత్తమ నటి(క్రిటిక్స్)గా బేబీ చిత్రానికి గానూ యంగ్ బ్యూటీ వైష్ణవి చైతన్యకు ఫిల్మ్‌ఫేర్ లభించింది.
ఇక వీళ్లే కాకుండా టాలీవుడ్ నుంచి ఉత్తమ సహయ నటి – రూపా లక్ష్మి (బలగం), బెస్ట్ మ్యూజిక్ ఆల్బమ్ – బేబీ (విజయ్ బుల్గానిన్), ఉత్తమ లిరిక్స్ – అనంత శ్రీరామ్ (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబీ), ఉత్తమ నేపథ్య గాయకుడు – శ్రీరామ చంద్ర (ఓ రెండు ప్రేమ మేఘాలిలా- బేబీ), ఉత్తమ నేపథ్య గాయని – శ్వేతా మోహన్ (మాస్టారు మాస్టారు – సర్), ఉత్తమ కొరియోగ్రఫీ- ప్రేమ్ రక్షిత్ (ధూమ్ ధామ్ దోస్తాన్- దసరా), బెస్ట్ ప్రొడక్షన్ డిజైన్ – కొల్లా అవినాశ్ (దసరా), ఉత్తమ డెబ్యూ దర్శకుడు- శ్రీకాంత్ ఓదెల (దసరా), శౌర్యవ్ (హాయ్ నాన్న), ఉత్తమ డెబ్యూ యాక్టర్ – సంగీత్ శోభన్ (మ్యాడ్), ఉత్తమ సినిమాటోగ్రఫీ- సత్యన్ సూర్యన్ (దసరా) ఫిల్మ్‌ఫేర్ అవార్డ్ విన్నర్స్ గా నిలిచారు.