నిత్యా మీనన్.. అచ్చ తెలుగు అమ్మాయిలా కనిపించే మలయాళ కుట్టి. హీరోయిన్లంతా గ్లామర్ పుంతలు తొక్కుతుంటే.. నిత్యా మీనన్ మాత్రం తన అభినయంతో అందర్నీ ఆకట్టుకుంది. సౌత్ లో స్టార్ హీరోయిన్ గా ముద్ర వేయించుకుంది. నటిగానే ఆగిపోకుండా సింగర్ గా, ప్రొడ్యూసర్ గా, వాయిస్ ఓవర్ ఆర్టిస్ట్ గా కూడా తన సత్తా ఏంటో నిరూపించుకుంది. ఇకపోతే తాజాగా తిరుచిత్రాంబళం(తెలుగులో తిరు) సినిమాకు గానూ జాతీయ ఉత్తమనటిగా నిత్యా మీనన్ ఎంపిక కావడంతో.. ఆమె గురించి అనేక ఆక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి.
1990 ఏప్రిల్ 8న బెంగళూరులో మలయాళీ తల్లిదండ్రులకు నిత్యా మీనన్ జన్మించింది. నటి కావాలని నిత్యా మీనన్ ఎప్పుడూ కోరుకోలేదు. అయితే అనుకోకుండా 8 ఏళ్ల వయసులో హనుమాన్ అనే హాలీవుడ్ మూవీలో నటించే అవకాశం నిత్యా మీనన్ కు వచ్చింది. 1998లో తొలిసారి ఆమె వెండితెరపై బాలనటిగా మెరిసింది. ఆ తర్వాత అడపా తడపా చిత్రాల్లో చైల్డ్ ఆర్టిస్ట్ గా చేస్తూనే.. మరోవైపు చదువుకుంది.
వాస్తవానికి నిత్యా మీనన్ జర్నలిస్టు అవ్వాలని ఆశపడింది. ఎక్కడ అవినీతి జరిగినా, అన్యాయం జరిగినా ధైర్యంగా ప్రశ్నించాలనుకుంది. అందులో భాగంగానే పూణెలో ఓ ఎంట్రెన్స్ ఎగ్జామ్ రాయడానికి వెళ్లగా.. నిత్యా మీనన్ కు డైరెక్టర్ నందినీ రెడ్డి పరిచయం అయింది. నిత్యా మీనన్ లుక్స్ నచ్చడంలో నందినీ రెడ్డి తన డెబ్యూ ఫిల్మ్ అలా మొదలైందిలో హీరోయిన్ గా చేయమని అడిగారట. అయితే అందుకు నిత్యా మీనన్ మొదట ఒప్పుకోలేదు. తాను చుదువుకోవాలని చెప్పిందట.
కానీ నందినీ రెడ్డి మాత్రం ఆమెను వదిలిపెట్టలేదు. నా సినిమా షూటింగ్ త్వరగానే అయిపోతుంది.. ఆ తర్వాత చదువుకో అని చెప్పారట. కథ కూడా నెరేట్ చేశారట. స్టోరీ నచ్చడంతో నిత్యా మీనన్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. 2011లో అలా మొదలైంది తో హీరోయిన్ గా తన సినీ ప్రయాణం మొదలు పెట్టింది. ఈ చిత్రం విజయవంతం కావడంతో నిత్యా మీనన్ వరుస అవకాశాలతో ఇండస్ట్రీలో ఫుల్ బిజీగా మారింది. ఇక తాను హీరోయిన్ కాకపోయుంటే కచ్చితంగా జర్నలిస్ట్ అయ్యేదానని గతంలో ఓ ఇంటర్వ్యూలో నిత్యా మీనన్ స్వయంగా వెల్లడించింది.