Moviesకెరీర్ మొత్తంలో చిరంజీవి పుట్టిన‌రోజున విడుద‌లైన‌ మెగాస్టార్ ఏకైక చిత్రం ఏదో...

కెరీర్ మొత్తంలో చిరంజీవి పుట్టిన‌రోజున విడుద‌లైన‌ మెగాస్టార్ ఏకైక చిత్రం ఏదో తెలుసా?

ఆగ‌స్టు 22.. మిగతా వారందరికీ ఇది ఒక సాధారణ రోజే అయినా మెగా అభిమానులకు మాత్రం పండుగ చేసుకుంటారు. ఎందుకంటే మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కాబట్టి. 1955 ఆగస్టు 22న ఆంధ్రప్రదేశ్ లోని పశ్చిమగోదావరి జిల్లా మొగల్తూరులో చిరంజీవి జన్మించారు. ఒక మధ్యతరగతి కుటుంబం నుంచి సినిమా పరిశ్రమలోకి అడుగుపెట్టిన చిరంజీవి.. 1978లో పునాదిరాళ్లు మూవీతో నటుడిగా తొలిసారి వెండితెరపై మెరిశారు. అప్పటికే తెలుగు చిత్ర పరిశ్రమలో హేమా హేమీల్లాంటి నటులు ఎందరో ఉన్నారు. వారందరితో పోటీ పడుతూ చిరంజీవి హీరోగా నిలదొక్కుకున్నారు. భారీ స్టార్డమ్ సంపాదించుకున్నారు.

జాతీయ స్థాయిలోనే కాకుండా అంతర్జాతీయ స్థాయిలో అభిమానులను సంపాదించుకున్నారు. ఐదున్నర దశాబ్దల సినీ ప్రయాణంలో చిరంజీవి 150 పైగా చిత్రంలో నటించారు. అయితే ఈ సినిమాలన్నిటిలో చిరంజీవి పుట్టినరోజున అంటే ఆగస్టు 22న విడుదలైన ఏకైక చిత్రం ఏదో తెలుసా.. చంటబ్బాయి. జంధ్యాల ద‌ర్శ‌క‌త్వం వ‌హించిన ఈ ఇన్వెస్టిగేష‌న్ కామెడీ డ్రామాలో చిరంజీవి, సుహాసిని జంట‌గా న‌టించారు.

ముచ్చెర్ల అరుణ, చంద్రమోహన్, కొంగర జగ్గయ్య, రావి కొండలరావు త‌దిత‌రులు ఇత‌ర ముఖ్య‌మైన పాత్ర‌ల‌ను పోషించ‌గా.. కె. చక్రవర్తి సంగీతం అందించారు. జ్యోతి ఆర్ట్ పిక్చర్స్ నిర్మించిన చంట‌బ్బాయి సినిమా.. 1986 ఆగ‌స్టు 22న విడుదలై విమర్శకుల ప్రశంసలు అందుకుంది. మరియు వాణిజ్యపరంగా విజయవంతమైంది. ఈ సినిమాలో చిరంజీవి చేసిన కామెడీని అప్ప‌టి ప్రేక్ష‌కుల‌కు అంత తొంద‌ర‌గా మ‌ర‌చిపోలేదు.

కంగారు టైపు మ‌రియు ఇంకా గుర్తింపు పొందని ఒక ప్రైవేటు డిటెక్టివ్‌గా చిరంజీవి అద‌ర‌గొట్టేశారు. యాక్షన్ హీరోగా చెలరేగిపోతున్న రోజుల్లో ఇటువంటి కామెడీ పాత్ర‌తో స‌హాసం చేసి ఆయ‌న సూప‌ర్ స‌క్సెస్ అయ్యారు. చిరంజీవి కెరీర్ లో అద్భుత కామెడీ చిత్రంగా చంట‌బ్బాయి నిలిచిపోయింది. కాగా, ఈ చిత్రంలో స్టార్ ప్రొడ్యూస‌ర్ అల్లు అరవింద్ ఒక చిన్న పాత్రలో నటించారు. అలాగే చంట‌బ్బాయిలోని హరిలో రంగ హరి పాటలో హరిదాసుగా, పోతురాజుగా, మిస్ మేరీగా చిరంజీవి పాత్రలు ప్రేక్షకులను కడుపుబ్బ నవ్విస్తాయి.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news