నటసింహం నందమూరి బాలకృష్ణ సినీ ప్రస్థానం ప్రారంభమై నేటికి 50 ఏళ్లు. ఈ సందర్భంగా ఆయన ఫిల్మ్ కెరీర్ కు సంబంధించి అనేక విషయాలు, విశేషాలు తెరపైకి వస్తున్నాయి. బాలయ్య నెలకొల్పిన రికార్డులు నెట్టింట ట్రెండ్ అవుతున్నాయి. ఇప్పటివరకు బాలకృష్ణ 108 చిత్రాల్లో నటించారు. అందులో దాదాపు 71 సినిమాలు వంద రోజులకు పైగా ఆడాయి. అయితే ఒక్క సినిమా మాత్రం 1000 రోజులు ప్రదర్శితమై రేర్ రికార్డును సాధించింది. ఇంతకీ బాలయ్య కెరీర్ లో 1000 రోజులు ఆడిన ఏకైక సినిమా ఏదో తెలుసా.. లెజెండ్.
బోయపాటి శ్రీను డైరెక్ట్ చేసిన ఈ యాక్షన్ డ్రామాలో బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేశాడు. రాధిక ఆప్టే, సోనాల్ చౌహాన్ హీరోయిన్లుగా నటించగా.. హీరో జగపతిబాబు లెజెండ్ మూవీతోనే విలన్ గా తన సెకండ్ ఇన్నింగ్స్ ప్రారంభించారు. 14 రీల్స్ ఎంటర్టైన్మెంట్, వారాహి చలన చిత్రం బ్యానర్లపై నిర్మితమైన లెజెండ్.. 2014 మార్చి 8న విడుదలై భారీ విజయాన్ని నమోదు చేసింది. తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుని బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపించింది.
రాష్ట్రవ్యాప్తంగా 700 థియేటర్లలో మరియు ప్రపంచవ్యాప్తంగా 1200 థియేటర్లలో రిలీజ్ అయిన లెజెండ్ మూవీ.. ఫుల్ రన్ లో రూ. 70 కోట్ల రేంజ్ లో వసూళ్లను కొల్లగొట్టింది. అలాగే 31 సెంటర్లలో 100 రోజులు, 2 సెంటర్లలో 175 రోజులు ఆడింది. కర్నూలు జిల్లాలోని యెమ్మిగనూరు మరియు కడప జిల్లాలోని ప్రొద్దుటూరులో లెజెండ్ సినిమా 200 రోజుల రన్ పూర్తి చేసుకుంది.
ముద్దుల మావయ్య, సమరసింహారెడ్డి, నరసింహా నాయుడు తర్వాత డబుల్ సెంచరీ పూర్తి చేసుకున్న 5వ సినిమాగా లెజెండ్ నిలిచింది. ఇక కర్నూలు జిల్లాలోని రెండు థియేటర్లలో నేరుగా నాలుగు షోలతో 365 రోజులు ఆడిన ఈ చిత్రం.. ప్రొద్దుటూరులో 1000 రోజులు ప్రదర్శించబడింది. అలా బాలకృష్ణ మొత్తం ఫిల్మ్ కెరీర్ లో వెయ్యి రోజుల రన్ పూర్తి చేసుకున్న ఏకైక చిత్రంగా లెజెండ్ అరుదైన రికార్డును సొంతం చేసుకుంది.