తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీలో ఉన్న మోస్టర్ సక్సెస్ ఫుల్ హీరోల్లో విక్టరీ వెంకటేష్ ఒకరు. అత్యధిక చిత్రాల నిర్మాత డి. రామానాయుడు తనయుడిగా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన వెంకటేష్.. భారీ బ్యాక్‌గ్రౌండ్ కు తోడు తనదైన ప్రతిభతో అగ్ర హీరోగా ఎదిగారు. అటు క్లాస్ ఇటు మాస్ చిత్రాలతో ప్రేక్షకులను అలరించారు. సుదీర్ఘ శని ప్రయాణంలో 70కి పైగా చిత్రాల్లో నటించారు. ఏడు నందిలతో సహా ఎన్నో అవార్డులు సంపాదించుకున్నారు. కోట్లాదిమంది ప్రేక్షకులను తన అభిమానులుగా మార్చుకున్నారు.
ఇప్పటికీ వరుస సినిమాలు చేస్తూ యంగ్ హీరోలకు వెంకీ గట్టి పోటీ ఇస్తున్నారు. అయితే ప్రస్తుతం ఒక్కో చిత్రానికి రూ. 12 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్న వెంకటేష్.. ఇండస్ట్రీలో నటుడిగా అందుకున్న ఫస్ట్ రెమ్యూనరేషన్ ఎంతో తెలుసా? కేవలం 1000 రూపాయలు. అవును, మీరు విన్నది నిజమే. 1986లో కలియుగ పాండవులు మూవీతో వెంకటేష్ హీరోగా తన కెరీర్ ప్రారంభించారని మనందరికీ తెలుసు.
కానీ అంతకన్నా ముందే వెంకీ ఒక సినిమాలో నటించారు. అదే ప్రేమ్ నగర్. కెఎస్ ప్రకాశరావు దర్శకత్వం వహించిన ఈ చిత్రాన్ని సురేష్ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై డి. రామానాయుడు నిర్మించారు. ఇందులో అక్కినేని నాగేశ్వరరావు మరియు వాణిశ్రీ జంటగా నటించారు. 1971లో విడుదలైన ప్రేమ్ నగర్ బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది. 750 రోజులకు పైగా థియేటర్లలో రన్ అయ్యింది. బాక్సాఫీస్ వద్ద రూ. 1.45 కోట్ల రేంజ్ లో వసూళ్లను కొల్లగొట్టింది.
ఇక ప్రేమ్ నగర్ చిత్రంలో వెంకటేష్ బాల నటుడిగా నటించారు. అప్పటికి ఆయన వయసు 10 ఏళ్లు. తండ్రి రామానాయుడు యాదృచ్ఛికంగా నటించమని అడగగా.. అందుకు వెంకీ వెంటనే ఒప్పుకున్నారు. ప్రేమ్ నగర్ మూవీలో యాక్ట్ చేసినందుకు గానూ రామానాయుడు వెంకటేష్‌కి రూ. 1000 పారితోషికం ఇచ్చారట. అదే తన ఫస్ట్ రెమ్యునరేషన్ అని గతంలో ఓ ఇంటర్వ్యూలో వెంకటేష్ స్వయంగా తెలిపారు.