రాజమౌళి అంటే తెలియని వారుండరు. టాలీవుడ్ లోనే కాదు యావత్ ఇండియన్ సినీ పరిశ్రమలో నెం. 1 వన్ దర్శకుడిగా పేరు తెచ్చుకున్నారాయన. ఆయనతో సినిమాలు చేసి పలువురు హీరో, హీరోయిన్లు భారీ స్టార్డమ్ సంపాదించుకున్నారు. జీవితంలో ఒక్కసారి అయినా రాజమౌళి డైరెక్షన్ లో సినిమా చేయాలని ఎంతో మంది నటులు కలలు కంటుంటారు. అయితే రాజమౌళితో వర్క్ చేసే గోల్డెన్ ఛాన్స్ వస్తే.. రిజెక్ట్ చేసిన నటులు కూడా ఉన్నారు. ఈ జాబితాలో పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ ఒకరు.
రాజమౌళి డైరెక్షన్ లో పవన్ కళ్యాణ్ గతంలో ఒక బ్లాక్ బస్టర్ మూవీని మిస్ చేసుకున్నారు. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు విక్రమార్కుడు. మాస్ మహారాజా రవితేజ, రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన యాక్షన్ థ్రిల్లర్ ఇది. ఈ సినిమాలో అనుష్క శెట్టి హీరోయిన్ గా నటించింది. అజయ్, వినీత్ కుమార్, రాజీవ్ కనకాల, రుతిక తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించగా.. ఎంఎం కీరవాణి సంగీతం అందించాడు.
భారీ అంచనాల నడుమ 2006లో విడుదలైన విక్రమార్కుడు ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకుంది. తొలి ఆట నుంచే ఈ సినిమాకు పాజిటివ్ టాక్ లభించింది. రాజమౌళి డైరెక్షన్, డ్యూయల్ రోల్స్ లో రవితేజ ఎనర్జిటిక్ యాక్టింగ్, అనుష్క పర్ఫామెన్స్, సాంగ్స్ మూవీకి హైలెట్ గా నిలిచాయి. రూ. 11 కోట్ల బడ్జెట్ తో నిర్మితమైన విక్రమార్కుడు.. ఫుల్ రన్ లో రూ. 19 కోట్ల రేంజ్ లో వసూళ్లను రాబట్టింది. అటు నిర్మాతలకు, ఇటు బయ్యర్లకు అదిరిపోయే లాభాలను అందించింది.
విక్రమార్కుడు సినిమాతో రవితేజ టాలీవుడ్ టాప్ హీరోల చెంత చేరాడు. అయితే వాస్తవానికి రాజమౌళి ఈ సినిమాను మొదట పవన్ కళ్యాణ్ తో చేయాలని భావించారట. పవన్ కళ్యాణ్ కు కథ కూడా నెరేట్ చేయడం జరిగింది. కానీ ఆ టైమ్ లో బంగారం, అన్నవరం సినిమాలతో చాలా బిజీ ఉండటంతో డేట్స్ అడ్జెస్ట్ చేయలేనని రాజమౌళితో పవన్ కళ్యాణ్ చెప్పాడట. దాంతో జక్కన్న మరో ఆలోచన లేకుండా రవితేజను హీరోగా పెట్టి విక్రమార్కుడు తీశాడు. కట్ చేస్తే సినిమా బ్లాక్ బస్టర్ హిట్ గా నిలిచింది.