ఆర్ఆర్ఆర్ మూవీతో గ్లోబల్ స్టార్ గా గుర్తింపు తెచ్చుకున్న యంగ్ టైగర్ ఎన్టీఆర్.. ప్రస్తుతం రెండు క్రేజీ ప్రాజెక్టులతో బిజీగా ఉన్న సంగతి తెలిసిందే. అందులో దేవర ఒకటి కాగా.. మరొకటి బాలీవుడ్ చిత్రం వార్ 2. కొరటాల శివ డైరెక్ట్ చేస్తున్న దేవర రెండు భాగాలుగా రాబోతోంది. అలాగే ప్రశాంత్ నీల్ డైరెక్షన్ లో కూడా ఎన్టీఆర్ ఆ మూవీ చేసేందుకు సంతకం చేశాడు. అయితే ప్రశాంత్ నీల్ మూవీ అనంతరం ఎన్టీఆర్ చేయబోయే నెక్స్ట్ ప్రాజెక్ట్ గురించి తాజాగా ఇంట్రెస్టింగ్ అప్డేట్ తెరపైకి వచ్చింది.
ఎంతోమంది అగ్ర దర్శకులు ఉండగా ఎన్టీఆర్ ఓ కుర్ర డైరెక్టర్ తో తన తదుపరి సినిమా చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చాడని జోరుగా వార్తలు వస్తున్నాయి. ఇంతకీ ఆ డైరెక్టర్ మరెవరో కాదు శౌర్యువ్. గత ఏడాది చివర్లో ఈ దర్శకుడు హాయ్ నాన్న మూవీతో ఇండస్ట్రీలోకి అడుగు పెట్టాడు. న్యాచురల్ స్టార్ నాని, మృణాల్ ఠాకూర్ జంటగా నటించిన హాయ్ నాన్న సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ఈ సినిమాను శౌర్యువ్ తెరకెక్కించిన విధానం, భావోద్వేగాలను చూపించిన తీరు ప్రేక్షకులనే కాకుండా విమర్శకులను సైతం ఆకట్టుకుంది.
తొలి సినిమాతోనే మంచి గుర్తింపు తెచ్చుకున్న యంగ్ డైరెక్టర్ శౌర్యువ్.. తన రెండో ప్రాజెక్ట్ ను ఏకంగా జూనియర్ ఎన్టీఆర్ తో సెట్ చేసుకున్నాడని ప్రచారం జరుగుతోంది. ఎన్టీఆర్‌తో రెండు భాగాలుగా ఓ భారీ యాక్షన్ డ్రామా మూవీని శౌర్యువ్ తెరకెక్కించబోతున్నాడని.. పాన్ ఇండియా స్థాయిలో వీరి ప్రాజెక్ట్ పట్టాలెక్కనుందని వార్తలు వస్తున్నాయి. అయితే తాజాగా ఈ వార్తలపై డైరెక్టర్ శౌర్యువ్ స్పందించాడు. దురదృష్టవశాత్తు ఎన్టీఆర్ తో సినిమా సెట్ అవ్వడం అనేది నిజం కాదు. అది కేవలం రూమర్ మాత్రమే. కానీ ఎప్పటికైనా అది నిజం కావాలని నేను బలంగా కోరుకుంటున్నాను అని శౌర్యువ్ స్పష్టం చేశాడు.