Moviesబ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మెగాస్టార్ చిరంజీవికి మాత్ర‌మే సొంత‌మైన రికార్డ్స్ ఇవి..!

బ‌ర్త్‌డే స్పెష‌ల్‌.. మెగాస్టార్ చిరంజీవికి మాత్ర‌మే సొంత‌మైన రికార్డ్స్ ఇవి..!

70వ దశకంలో ఎటువంటి సినీ నేపథ్యం లేకుండా ఇండస్ట్రీలోకి అడుగుపెట్టిన చిరంజీవి.. తనదైన ప్రతిభ, స్వయంకృషి, పట్టుదలతో హీరోగా నిలదొక్కుకున్నారు. ఎన్ని అవరోధాలు ఎదురైనా ధైర్యంగా నిలబడ్డారు. సామాన్యుడి నుంచి అసమాన్యుడిగా ఎదిగారు. భారీ పోటీని తట్టుకుని తెలుగు చలనచిత్ర పరిశ్రమంలో నెంబర్ వన్ హీరోగా గుర్తింపు పొందిన మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా ఆయనకు సోషల్ మీడియాలో బర్త్‌డే విషెస్ వెల్లువెత్తుతున్నాయి. అలాగే మరోవైపు చిరంజీవికి సంబంధించి అనేక ఆసక్తికర విషయాలు తెరపైకి వస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే చిరంజీవికి మాత్రమే సొంతమైన కొన్ని అరుదైన రికార్డ్స్ గురించి ఇప్పుడు తెలుసుకుందాం.

ఎన్టీఆర్, ఏఎన్నార్, కృష్ణ, శోభన్ బాబు వంటి అగ్రకథానాయకులు సినీ ఇండస్ట్రీని ఏలుతున్న సమయంలో పునాదిరాళ్లు మూవీతో 1978లో చిరంజీవి తెలుగు సినీ పరిశ్రమలోకి అడుగుపెట్టారు. 1983లో వచ్చిన ఖైదీతో హీరోగా ఆయ‌న‌కు బ్రేక్ వ‌చ్చింది. ఆ త‌ర్వాత చిరు వెన‌క్కి తిరిగి చూసుకోలేదు. అంచెలంచెలుగా ఎదిగారు. సినీ ఇండస్ట్రీలో అత్యధిక రెమ్యునరేషన్ తీసుకున్న తొలి భారతీయ నటుడిగా రికార్డు సృష్టించారు. 1992లోనే ఒక్కో సినిమాకు రూ. కోటి పారితోషికం తీసుకున్నారు.

పర్సనల్ వెబ్ సైట్ కలిగిన మొట్ట‌మొద‌టి భారతీయ నటుడు చిరంజీవి. https://www.kchiranjeevi.com/ వెబ్ సైట్ ఓపెన్ చేస్తే ఆయ‌న గురించి పూర్తి స‌మాచారాన్ని తెలుసుకోవ‌చ్చు. చిరంజీవి న‌టించిన‌ స్వయంకృషి సినిమా రష్యన్ లోకి డబ్ అయిన తొలి తెలుగు సినిమా. ఇదీ ఒక రికార్డే. అలాగే ప్రతిష్టాత్మక ఆస్కార్ వేడుకలో గెస్ట్ గా పాల్గొనే ఆహ్వానం అందుకున్న తొలి దక్షిణాది నటుడిగా చిరంజీవి 1987లో అరుదైన ఘ‌న‌త సొంతం చేసుకున్నారు.

ఏకపాత్రాభినయం, ద్విపాత్రాభినయం, త్రిపాత్రాభినయం చేసిన చిత్రాలు వంద రోజులు ఆడిన ఘ‌న‌త చిరంజీవికే ద‌క్కింది. పసివాడి ప్రాణం చిత్రం ద్వారా టాలీవుడ్ కే కాకుండా యావ‌త్‌ ఇండియా మొత్తానికి బ్రేక్‌ డ్యాన్స్ ను ప‌రిచ‌యం చేసిన తొలి హీరో చిరంజీవి. 1980, 1983 ఈ ఏడాదుల్లో చిరు నటించిన 14 చిత్రాలు థియేట‌ర్స్ లో సంద‌డి చేశాయి. ఇది కూడా ఒక రికార్డే. ఇక 1999 – 2000 ఆర్థిక సంవత్సరంలో అత్యధిక ట్యాక్స్​ చెల్లించిన వ్యక్తిగా చిరంజీవి మ‌రో ఘ‌న‌త సాధించారు. అందుకుగానూ ఆయన్ను ప్రభుత్వం సమ్మాన్‌ అవార్డుతో సత్కరించింది.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news