నట సింహం నందమూరి బాలకృష్ణకి సంబంధించి ప్రస్తుతం ఒక క్రేజీ న్యూస్ నెట్టింట వైరల్ గా మారింది. దాదాపు 20 ఏళ్ల తర్వాత బాలకృష్ణ మళ్ళీ ఓ రీమేక్ మూవీ చేయడానికి రెడీ అయ్యారని జోరుగా ప్రచారం జరుగుతోంది. హీరోగా ఎదుగుతున్న సమయంలో బాలకృష్ణ పలు రీమేక్ చిత్రాలు చేశారు. భారీ స్టార్డమ్ వచ్చిన తర్వాత మాత్రం స్ట్రెయిట్ మూవీస్‌కే ఆయన అధిక ప్రధాన్యత ఇచ్చారు. అందువల్ల గత ఇరవై ఏళ్లలో బాలయ్య నుంచి ఒక్క రీమేక్ సినిమా కూడా రాలేదు.
ఆయన చివరగా చేసిన రీమేక్ చిత్రం లక్ష్మీ నరసింహ. ఈ సినిమా మంచి విజయమే సాధించింది. ఇదిలా ఉంటే.. చాలా కాలం అనంతరం బాలయ్య ఓ మలయాళ బ్లాక్ బస్టర్ ను తెలుగులోకి రీమేక్ చేసేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట. ఇంతకీ ఆ చిత్రం మరేదో కాదు ఆవేశం. మలయాళ స్టార్ ఫహద్ ఫాసిల్ ప్రధాన పాత్రలో జిత్తు మాధవన్ తెరకెక్కించిన గ్యాంగ్‌స్టర్ యాక్షన్ కామెడీ చిత్రమిది.
ఏప్రిల్ లో విడుదలైన ఈ సినిమా ఎలాంటి విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. రూ. 30 కోట్ల బడ్జెట్‌తో నిర్మితమైన ఆవేశం.. ఫుల్ రన్ లో రూ. 156 కోట్లకు పైగా కలెక్షన్స్ ను వసూలు చేసి బ్లాక్ బస్టర్ హిట్‌గా నిలిచింది. హీరోయిన్ లేకపోయినా కూడా సినిమా కథాంశం, ఫహద్ ఫాసిల్ వండర్ఫుల్ యాక్టింగ్, యాక్షన్ సన్నివేశాలు, స్క్రీన్ ప్లే, సంగీతం వంటి అంశాలు కారణంగా ఆవేశం చిత్రాన్ని ప్రేక్షకులకు విశేషంగా ఆదరించారు. ఓటీటీలో కూడా ఈ సినిమాకు అదిరిపోయే రెస్పాన్స్ వచ్చింది.
అయితే ఈ మలయాళ బ్లాక్‌బస్టర్ ను ఇప్పుడు తెలుగులో బాలకృష్ణ రీమేక్ చేయబోతున్నారని వార్తలు వస్తున్నాయి. ఫహద్ ఫాసిల్ పోషించిన రౌడీ రంగ పాత్రలో బాలయ్య యాక్ట్ చేయబోతున్నారట. ప్రస్తుతం ఆవేశం తెలుగు రీమేక్ రైట్స్ కోసం ప్రముఖ నిర్మాత సంస్థ మైత్రీ మూవీ మేకర్స్ ప్రయత్నిస్తుందని కూడా టాక్ నడుస్తోంది. ఇంతవరకు ఈ విషయంపై ఎటువంటి అధికారిక ప్రకటన లేదు. కానీ నిజంగా ఆవేశం రీమేక్ కు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇచ్చుంటే మాత్రం పెద్ద సాహసం చేస్తున్నట్లే అవుతుంది.