సినిమా పరిశ్రమలో కథలు చేతులు మారడం అనేది చాలా కామన్. స్టోరీ నచ్చక ఒక హీరో రిజెక్ట్ చేస్తే.. ఆ కథ మరొక హీరోకు నచ్చడం, సినిమా చేయడం తరచూ జరుగుతూనే ఉంటుంది. అయితే అలా రిజెక్ట్ చేసిన కథలు హిట్టైతే హీరోలు ఎంత బాధపడతారో.. ఫ్లాప్ అయితే హమ్మయ్య బతికిపోయామని అంతకన్నా ఎక్కువ సంతోషపడతారు. ఇటువంటి పరిణామం టాలీవుడ్ మ్యాచో హీరో గోపీచంద్ కెరీర్ లోనూ చోటుచేసుకుంది. నటసింహం నందమూరి బాలకృష్ణ నటించిన ఒక డిజాస్టర్ మూవీ నుంచి గోపీచంద్ చాలా తెలివిగా తప్పించుకున్నాడు.
ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు రూలర్. కెఎస్ రవికుమార్ డైరెక్ట్ చేసిన యాక్షన్ డ్రామా ఇది. సి.కె ఎంటర్‌టైన్‌మెంట్స్, హ్యాపీ మూవీస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో బాలకృష్ణకు జోడిగా వేదిక, సోనాల్ చౌహాన్ నటించారు. భూమిక, షతాఫ్ ఫిగర్, జయసుధ, సాయాజీ షిండే తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. భారీ అంచనాల నడుమ 2019లో విడుదలైన రూలర్ డిజాస్టర్ గా నిలిచింది.
రొటీన్ కమర్షియల్ మూవీ అని సినిమా విశ్లేషకులు తేల్చేశారు. అలాగే బాలయ్య లుక్స్ పై కూడా ఎన్నో విమర్శలు వచ్చాయి. అయితే వాస్తవానికి ఈ సినిమా కథ అసలు బాలయ్య కోసం రాసుకున్నది కాదు. ఆయన చేయాల్సింది కాదు. పరుచూరి మురళి దగ్గర నుంచి కథ తీసుకున్న డైరెక్టర్ కెఎస్ రవికుమార్.. మొదట గోపీచంద్ తో సినిమా తీయాలని భావించారు. ఆయన్ను కలిసి కథ కూడా వినిపించారు. ఆల్మోస్ట్ ప్రాజెక్ట్ ఓకే అయింది.
అయితే అప్పుడే డైరెక్టర్ సంపత్ నంది గోపీచంద్ కు సీటిమార్ స్టోరీని నెరేట్ చేశాడు. రూలర్ కన్నా సీటిమార్ కథే గోపీచంద్ ను ఎక్కువగా ఆకట్టుకోవడంతో.. ఆయన కెఎస్ రవికుమార్ కు నో చెప్పేశాడు. సరిగ్గా అదే సమయంలో ఎన్టీఆర్ కథానాయకుడు, మహానాయకుడు సినిమాల తర్వాత వచ్చే చిత్రం అన్ని హంగులతో ఉండాలని భావించిన బాలయ్య.. తన తదుపరి ప్రాజెక్ట్ ను కమర్షియల్ డైరెక్టర్‌గా పేరుగాంచిన కెఎస్ రవికుమార్‌కు అప్పగించారు. దాంతో గోపీచంద్ రిజెక్ట్ చేసిన కథతోనే బాలయ్యను మెప్పించి రూలర్ తీశారు. సీన్ కట్ చేస్తే.. సినిమా బాక్సాఫీస్ వద్ద దారుణమైన పరాజయాన్ని మూటగట్టుకుంది.