నట సింహం నందమూరి బాలకృష్ణ ఎంత గొప్ప నటుడో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. వ్యక్తిగతంగా కూడా బాలయ్యను ఎంతో మంది అభిమానిస్తూ ఉంటారు. బాలకృష్ణది చిన్న పిల్లల మనస్తత్వం. ఒక్కసారి ఆయనకు ఎవరైనా నచ్చితే వారికోసం ఎంత దూరమైనా వెళ్తాడు. ఈ విషయం పలుమార్లు నిరూపితం అయింది. ఇకపోతే బాలయ్యను విమర్శించే వారు కూడా ఎందరో ఉన్నారు. బాలకృష్ణ కోపం గురించి, ప్రవర్తన గురించి రకరకాల కామెంట్స్ వినిపిస్తూనే ఉంటాయి.
కొందరైతే బాలకృష్ణ ఒక సైకో అని, ఆయనకు సంస్కారం లేదని కూడా తిట్టారు. అలాంటి వాళ్లకు సీనియర్ డైరెక్టర్ కోదండరామిరెడ్డి చెంప చెల్లుమనేలా సమాధానం ఇచ్చారు. బాలయ్య సంస్కారం గురించి ఆయన కొన్ని ఆసక్తికర విషయాలను బయటపెట్టారు. కోదండరామిరెడ్డి, బాలకృష్ణలది హిట్ కాంబో. వీరి కలయికలో బొబ్బిలి సింహం, నారీ నారీ నడుమ మురారి, అనసూయమ్మగారి అల్లుడు, భానుమతి గారి మొగుడుతో సహా ఎన్నో విజయవంతమైన చిత్రాలు వచ్చాయి.
అయితే తాజాగా ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న కోదండరామిరెడ్డి.. బాలకృష్ణ వ్యక్తిత్వం గురించి మాట్లాడాడు. సెట్లో బాలయ్య బాబు ఎంతో సరదాగా ఉండేవారు. అందరికీ నమస్కారం చేస్తూ వచ్చేవారు. సొంత సినిమా అయితే టీ తాగారా .. భోజనాలు చేశారా? అని ఆప్యాయంగా అడిగేవారు. నేను రామారావుగారి అబ్బాయిని, ముఖ్యమంత్రి కొడుకుని, గోల్డెన్ స్పూన్ తో పుట్టాను, నేను స్టార్ హీరోను అన్న గర్వం ఆయనకు ఉండేది కాదు.
మా అందరితో కలివిడిగా మెలిగేవారు. మాతో కలిసి భోజనం చేసేవారు. ఇప్పటికీ నేను ఎప్పుడు ఎక్కడ కనిపించినా మా ఇంట్లోని వాళ్లందరినీ పేరు పేరున అడుగుతారు అంటూ కోదండరామిరెడ్డి చెప్పుకొచ్చారు. ప్రస్తుతం ఆయన చేసిన వ్యాఖ్యలు సోషల్ మీడియాలో వైరల్ గా మారాయి. నందమూరి అభిమానులు కోదండరామిరెడ్డి కామెంట్స్ పట్ల హర్షం వ్యక్తం చేస్తున్నారు.