టాలీవుడ్‌కు ఈ ఏడాది ఏ మాత్రం కలిసి రాలేదు. సంక్రాంతి సినిమాలు కూడా అంతంత మాత్రమే ఆడాయి. అయితే జూలై చివర్లో వచ్చిన కల్కి సినిమా రెండు మూడు వారాలపాటు బాక్సాఫీస్ ను కళకళలాడించింది. ఆ తర్వాత ఒక్క సినిమా కూడా ప్రేక్షకులను అలరించలేదు. కొత్త సినిమాలు వరుసగా వస్తున్నాయి.. పోతున్నాయి. కానీ థియేటర్లలో జనాలు లేక బాక్సాఫీస్ వెలవెల పోయింది. చివరకు నెలరోజులపాటు థియేటర్లను కూడా మూసివేశారు. అలాంటి టైంలో ఇండిపెండెన్స్‌డే వీకెండ్.. మళ్లీ థియేటర్లకు కళ తీసుకువచ్చింది. ఒకటి కాదు, రెండు కాదు, ఏకంగా నాలుగు సినిమాలు ప్రేక్షకుల ముందుకు వచ్చాయి.
ముందుగా తెలుగు సినిమాల విషయానికొస్తే రవితేజ – హరీష్ శంకర్.. మిస్టర్ బచ్చన్, పూరి జగన్నాథ్ – రామ్.. డబుల్ ఇస్మార్ట్ సినిమాలకు తోడు నార్నే నితిన్ ఆయ్ సినిమా.. విక్రమ్ తంగలాన్ డబ్బింగ్ మూవీ కూడా థియేటర్లోకి వచ్చాయి. ఇన్ని సినిమాలు ఒకేరోజు రిలీజ్ కావడంతో.. ప్రేక్షకులు బెటర్ ఆప్షన్ చూసుకుని థియేటర్లకు వెళ్తారు. అయితే రిలీజ్ ముందు వరకు క్రేజ్ పరంగా నెంబర్ వన్ స్థానంలో ఉన్న మిస్టర్ బచ్చన్.. రిలీజ్ తర్వాత చివరి స్థానానికి పడిపోయింది. నిర్మాతలు ఎంతో కాన్ఫిడెంట్గా ముందు రోజు ప్రీమియర్ షోలు కూడా వేశారు.
ప్రీమియర్ షో రూమ్ నుంచి ఈ సినిమాకు నెగిటివ్ టాక్ బాగా స్ప్రెడ్ అయింది. తొలి రోజు కూడా చాలా చోట్ల ఆక్యుపెన్సిలు పడిపోయాయి. డబ్బులు ఇస్మార్ట్ విషయానికొస్తే.. ఆ సినిమాకు కూడా మంచి టాక్ లేదు. అయితే మిస్టర్ బచ్చన్ తో పోలిస్తే బెటర్ అని తేలింది. మాస్‌లో ఈ సినిమాకు మంచి స్పందన వస్తోంది. వీకెండ్ వరకు డబ్బుల్ ఇస్మార్ట్‌కు ఢోకా లేదు. సోమవారం నుంచి ఈ సినిమా నిలబడుతుందా.. లేదా.. అన్నది చూడాలి.
ఇక విక్రమ్ తంగలాన్ సినిమాకు ప్రోమోల్లో ఉన్నంత గొప్పతనం సినిమాలో లేదు. కానీ వెరైటీ సినిమాలు విక్రమ్ నటన చూడాలనుకునే వారికి ఇది కచ్చితంగా మంచి ఆప్షన్. ఇండిపెండెన్స్ డే వీకెండ్ లో రిలీజ్ అయిన వాటిలో అన్నిటికన్నా చిన్న సినిమా.. తక్కువ అంచనాలు ఉన్న సినిమా ఆయ్. అయితే ఈ సినిమా చాలా మంచి టాక్ తో అందరినీ ఆశ్చర్యపరుస్తుంది. మంచి ఎంటర్టైనర్ టాక్ రావడంతో షోకు కలెక్షన్లు పెరుగుతున్నాయి. ఓవరాల్‌గా ఆయ్ అనే చిన్న సినిమా ఇండిపెండెన్స్ డే వీకెండ్ విన్నర్ గా నిలిచేలా కనిపిస్తోంది.