సినీ పరిశ్రమలో దశాబ్దాల పాటు అగ్రకథానాయికగా ఓ వెలుగు వెలిగిన సౌందర్య మరణం ఎప్పటికీ మరచిపోలేని చేదు నిజం. అయితే సౌందర్య భౌతికంగా లేకపోయినా ప్రేక్షకుల హృదయాల్లో సజీవంగానే ఉంది అనడంలో ఎటువంటి సందేహం లేదు. అలాగే సౌందర్యతో తమకున్న అనుబంధాన్ని, స్నేహాన్ని సినీ ప్రముఖులు తరచూ అభిమానులతో పంచుకుంటూనే ఉంటారు. ఆమెను ఎప్పటికప్పుడు గుర్తు చేస్తూనే ఉంటారు.
ఈ క్రమంలోనే సౌందర్య క్లోజ్ ఫ్రెండ్, ఒకప్పటి స్టార్ హీరోయిన్ ఆమని తాజాగా ఇంటర్వ్యూలో ఎవరికీ తెలియని ఓ ఆసక్తికర విషయాన్ని రివీల్ చేశారు. సౌందర్యతో ఇండస్ట్రీలో ఉన్న బెస్ట్ ఫ్రెండ్స్ లో ఆమని ఒకరు. ఇద్దరూ చాలా సన్నిహితంగా ఉండేవారు. ఆమని తరచూ సౌందర్య ఇంటికి కూడా వెళ్తుండేది. అయితే ఆమని వ్యక్తితత్వం నచ్చడంతో సౌందర్య తండ్రి కె. ఎస్. సత్యనారాయణ గారు ఆమెను తన ఇంటికి కోడలిగా చేసుకోవాలని భావించారట.
సౌందర్య అన్న అమరనాథ్ తో ఆమని పెళ్లి చేస్తే బాగుంటుందని అనుకున్నారు. అంతేకాదు ఒకరోజు తమ ఇంటికి వచ్చిన ఆమని ఎదుట సత్యనారాయణ గారు పెళ్లి ప్రపోజల్ కూడా పెట్టారు. మా అబ్బాయి అమర్ ను పెళ్లి చేసుకుంటావా అని ఆయన నేరుగా అడగ్గానే.. ఆమని షాక్ అయిపోయింది. ఏం చెప్పాలో అర్థం అవ్వక ఆమని తన పక్కనే ఉన్న సౌందర్యను చూస్తూ ఉండిపోయింది. దాంతో సత్యనారాయణ గారు టైమ్ తీసుకుని చెప్పమని అన్నారట.
అయితే అమర్ ను పెళ్లి చేసుకునేందుకు ఆమని అంగీకరించలేదు. ఎందుకంటే కాలేజ్ లో అమర్ కు ఓ లవ్ స్టోరీ ఉంది. అది వాళ్ల నాన్నకు తెలియదు. ఇక సౌందర్య నాన్నగారు చనిపోయిన తర్వాత అమర్ తాను ప్రేమించిన అమ్మయిని పెళ్లి చేసుకున్నాడు. ఈ విషయాన్ని ఇటీవల ఓ ఇంటర్వ్యూలో ఆమని స్వయంగా వెల్లడించారు. కాగా, 2004లో జరిగిన విమాన ప్రమాదంలో సౌందర్యతో పాటు ఆమె అన్న అమరనాథ్ కూడా సజీవ దహనం అయిన సంగతి తెలిసిందే.