నటసింహం నందమూరి బాలకృష్ణ కెరీర్ లో ఇండస్ట్రీ హిట్ గా నిలిచిన చిత్రాల్లో సమరసింహా రెడ్డి ఒకటి. బి. గోపాల్ దర్శకత్వం వహించిన ఈ సినిమాను సత్యనారాయణమ్మ ప్రొడక్షన్స్ బ్యానర్‌పై చెంగల వెంకట్ రావు నిర్మించారు. తండ్రీకొడుకులుగా బాలకృష్ణ ద్విపాత్రాభినయం చేయగా.. అంజల జవేరి, సిమ్రాన్ హీరోయిన్లుగా నటించారు. మణిశర్మ సంగీత దర్శకుడిగా వ్యవహరించారు.
సంక్రాంతి పండుగ కనుకగా 1999 జనవరి 13న విడుదలైన సమరసింహా రెడ్డి సంచలన విజయాన్ని నమోదు చేసింది. తొలి ఆట నుంచే హిట్ టాక్ తెచ్చుకుని కాసుల వర్షాన్ని కురిపించింది. చెంగల వెంకట్ రావు రూ. 6 కోట్ల బడ్జెట్ తో సినిమాను నిర్మించగా.. ఫుల్ రన్ లో రూ. 15 కోట్ల డిస్ట్రిబ్యూటర్ షేర్‌ని రాబట్టి ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. అలాగే మూడు థియేటర్లలో 227 రోజులు, 29 కేంద్రాల్లో 175 రోజులు, 122 కేంద్రాల్లో 50 రోజులు, 32 కేంద్రాల్లో 100 రోజులు, ఒక థియేటర్‌లో 365 రోజులు ఆడి సమరసింహా రెడ్డి రికార్డులు తిరగరాసింది.
అప్పట్లో లవ్ ట్రాక్ లేకుండా బాక్సాఫీస్ వద్ద హిట్ కొట్టిన తొలి సినిమా ఇదే. అలాగే ఫ్యాక్షన్ బేస్డ్ కథాంశంతో ఇండస్ట్రీ హిట్ అయిన మొదటి సినిమా కూడా ఇదే కావడం విశేషం. సమరసింహా రెడ్డి తర్వాత తెలుగు చిత్ర పరిశ్రమలో అనేక ఫ్యాక్షన్ ఆధారిత కథా చిత్రాలు వచ్చాయి. అయితే చాలా మందికి తెలియని విషయం ఏంటంటే.. సమరసింహా రెడ్డి మూవీలో హీరో క్యారెక్టర్ కు ఫస్ట్ ఛాయిస్ బాలయ్య కాదు.
మొదట డైరెక్టర్ బి. గోపాల్ మరొక టాలీవుడ్ స్టార్ హీరోతో ఈ సినిమాని చేయాలని భావించారు. ఆ హీరో మరెవరో కాదు విక్టరీ వెంకటేష్. బి. గోపాల్ వెంకటేష్ ను కలిసి సమరసింహా రెడ్డి కథ చెప్పగా.. ఆయనకు స్టోరీ బాగా నచ్చింది. కానీ ఇటువంటి యాక్షన్ కథ తనకు సెట్ కాదని భావించిన వెంకీ సున్నితంగా తిరస్కరించారు. దాంతో బి. గోపాల్ మరో ఆలోచన లేకుండా బాలకష్ణతో సమరసింహా రెడ్డి తీసి ఇండస్ట్రీ హిట్ కొట్టారు. ఇక ఆ తర్వాత ఎన్. శంకర్ అనే దర్శకుడు ఫ్యాక్షన్ బ్రాక్ డ్రాప్‌లో జయం మనదిరా కథ చెప్పడంతో వెంకటేష్ వెంటనే ఓకే చేయడం జరిగింది. 2000లో సంవత్సరంలో రిలీజ్ అయిన జయం మనదిరా మూవీ కూడా హిట్ అయింది.