కలియుగ దైవంగా ప్రతి ఇంటా ఆరాధించ బడ్డ నటుడు నందమూరి తారక రామారావు గారు. పౌరాణిక, జానపద, సాంఘిక చిత్రాల్లో వైవిధ్యభరితమైన పాత్రలెన్నో పోషించి విశ్వ విఖ్యాత నటసార్వభౌముడుగా పేరు తెచ్చుకున్నారాయన. రాముడు, కృష్ణుడు వంటి పాత్రలతో తెలుగు వారి హృదయాల్లో చెరగని ముద్ర వేశారు. రాజకీయ నేతగానూ అభిమానించబడ్డారు. ఇక ఆయన వ్యక్తిగత జీవితం తెరిచిన పుస్తకమే.. అయినప్పటికీ అందులో కొన్ని పేజీల గురించి బహుశా చాలా మందికి తెలిసుండకపోవచ్చు.
తెలుగు చలన చిత్ర పరిశ్రమలో రెండు వివాహాలు చేసుకున్న నటుల్లో ఎన్టీఆర్ ఒకరు. సినిమా పరిశ్రమలోకి రాకముందే 20 ఏళ్ళ వయసులో మేనమామ కుమార్తె అయిన బసవ రామతారకాన్ని ఎన్టీఆర్ పెళ్లి చేసుకున్నారు. ఈ దంపతులకు 11 మంది సంతానం. క్యాన్సర్ తో బసవ రామతారకం గారు కన్ను మూసిన తర్వాత 1993లో ఎన్టీఆర్ లక్ష్మీపార్వతిని వివాహం చేసుకున్నారు. అయితే లక్ష్మీ పార్వతి కన్నా ముందు ఎన్టీఆర్ ఒక హీరోయిన్ ను పెళ్లి చేసుకోవాలని భావించారు.
ఆ హీరోయిన్ మరెవరో కాదు దివంగత తార కృష్ణకుమారి. సుధీర్గ సినీ ప్రయాణంలో ఎన్టీఆర్ సరసన 47 మంది హీరోయిన్లు నటించారు. వారందరిలో కృష్ణకుమారి గారు ఎన్టీఆర్ కు చాలా స్పెషల్. వీరిద్దరి కాంబినేషన్ లో 25 చిత్రాలు వచ్చాయి.ఆ సినిమాలన్నీ ఘన విజయాలు సాధించాయి. అయితే స్టార్ హీరోగా చక్రం తిప్పుతున్న రోజుల్లో ఎన్టీఆర్ గారు హీరోయిన్ కృష్ణ కుమారితో ప్రేమలో పడ్డారంటూ పెద్ద ఎత్తున ప్రచారం జరిగింది.
అంతేకాదు కృష్ణకుమారిని పెళ్లి కూడా చేసుకుందామనుకున్నారట. అప్పటికే ఎన్టీఆర్ కు పెళ్లై, పిల్లలు ఉన్నారు. కానీ కృష్ణకుమారి ఆయన మనసుకు ఎంతగానో దగ్గరయ్యారు. దాంతో ఆమెను రెండో వివాహం చేసుకోవాలని భావించారు. అయితే ఈ విషయం తెలుసుకున్న ఎన్టీఆర్ చిన్నాయన త్రివిక్రమరావు నేరుగా కృష్ణకుమారి ఇంటికి వెళ్లి తుపాకితో ఆమెను బెదిరించారట. ఆంధ్రులందరూ రాముడిలా భావించే ఎన్టీఆర్ తో రెండో పెళ్లి అంటే అందరూ ఏమనుకుంటారు.. ఆయనకు దూరంగా వెళ్లిపోవాలని హెచ్చరించారట. ఆ దెబ్బతో కృష్ణకుమారి ఒక్కసారే 17 సినిమాలు క్యాన్సిల్ చేసుకుని బెంగళూరు వెళ్లిపోయారు. ఆ తర్వాత కొన్ని రోజులకు అజయ్ మోహన్ ఖైతాన్ అనే వ్యాపారవేత్తను ఆమె పెళ్లి చేసుకోవడం జరిగింది.