తమిళ హీరో అయినప్పటికీ తెలుగు ఇండస్ట్రీలో తనకంటూ ప్రత్యేకమైన గుర్తింపు తెచ్చుకున్న నటుల్లో విశాల్ ఒకరు. సత్యం, పందెంకోడి, పందెంకోడి 2 వంటి సినిమాలు విశాల్ ను తెలుగు ప్రేక్షకులకు దగ్గర చేశాయి. దాంతో విశాల్ తమిళంలో నటించే ప్రతి చిత్రాన్ని తెలుగులో కూడా విడుదల చేస్తుంటారు. ఇకపోతే విశాల్ ఇంతవరకు తెలుగులో నేరుగా ఒక్క సినిమా కూడా చేయలేదు. కానీ గతంలో ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ మూవీలో విలన్ క్యారెక్టర్ చేసే అవకాశం రాగా.. విశాల్ రిజెక్ట్ చేశాడు.
ఇంతకీ అల్లు అర్జున్ హీరోగా విశాల్ విలన్ గా మిస్ అయిన సినిమా మరేదో కాదు వరుడు. గుణశేఖర్ డైరెక్ట్ చేసిన రొమాంటిక్ యాక్షన్ మూవీ ఇది. ఈ చిత్రంలో అల్లు అర్జున్, భాను శ్రీ మెహ్రా జంటగా నటించగా.. తమిళ నటుడు ఆర్య ప్రతినాయకుడి పాత్రను పోషించాడు. సుహాసిని మణిరత్నం, ఆశిష్ విద్యార్థి, నరేష్, వినయ ప్రసాద్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
యూనివర్సల్ మీడియా బ్యానర్ పై డివివి దానయ్య నిర్మించిన వరుడు మూవీ 2010లో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. డైరెక్టర్ గుణశేఖర్ విజువల్ ఎఫెక్ట్స్ పై పెట్టినంత ఫోకస్ కథ, కథనంపై పెట్టలేదని ఎన్నో విమర్శులు వచ్చాయి. ఇకపోతే ఈ చిత్రంలో విలన్ క్యారెక్టర్ కోసం గుణశేఖర్ మొదట తమిళ హీరో విశాల్ ను సంప్రదించారట. కానీ ప్రతినాయకుడిగా నటించేందుకు మనసు అంగీకరించకపోవడంతో నో చెప్పానని విశాల్ గతంలో ఓ ఇంటర్వ్యూలో స్వయంగా వెల్లడించారు. విశాల్ రిజెక్ట్ చేయడంలో వరుడు మూవీలో యాక్ట్ చేసే ఛాన్స్ ఆర్యకి వచ్చింది.