టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు, కోలీవుడ్ స్టార్ సూర్య వేరువేరు ఇండస్ట్రీలకు చెందిన వారైనప్పటికీ ఈ ఇద్దరు హీరోలకు మధ్య ఒక స్ట్రోంగ్ కనెక్షన్ ఉంది. మహేష్ బాబు, సూర్య క్లాస్‌మేట్స్ అండ్ క్లోజ్ ఫ్రెండ్స్. బహుశా చాలా మంది ఫాన్స్ కి కూడా ఈ సీక్రెట్ తెలిసి ఉండదు. ఒకప్పుడు తెలుగు ఇండస్ట్రీ చెన్నైలోనే ఉండేదన్న సంగతి తెలిసిందే. అందువల్ల సెలబ్రిటీల పిల్లలు అక్కడే చదువుకున్నారు.
మహేష్ బాబు బాల్యం మొత్తం చెన్నైలోనే గడిచింది. స్టడీస్ కూడా మహేష్ చెన్నైలోనే కంప్లీట్ చేశాడు. పదో తరగతి వరకు చెన్నైలోని సెయింట్ బీడ్ స్కూల్ లో మహేష్ బాబు చదువుకున్నాడు. అయితే ఆ సమయంలో మహేష్ బాబుకు హీరో సూర్య, భారతీయ స్వరకర్త మరియు నేపథ్య గాయకుడు యువన్ శంకర్ రాజా క్లాస్‌మేట్స్ గా ఉండేవారు. అలాగే మహేష్, సూర్య మరియు యువన్ శంకర్ రాజా మంచి స్నేహితులుగా మెలిగేవారు. కలిసి చదువుకోవడమే కాదు స్కూల్ లో ముగ్గురూ కలిసే భోజనం చేసేవాళ్లు.
ఒకరి ఇంట్లో చేసిన వంటకాలను మరొకరి కోసం తీసుకెళ్లే స్థాయి ఫ్రెండ్ షిప్ తమ మధ్య ఉండేదని గతంలో ఓ ఇంటర్వ్యూలో సూర్య స్వయంగా వెల్లడించాడు. అలాగే తాము తమ ఫ్యామిలీస్ గురించి ఎక్కువగా మాట్లాడుకునే వాళ్లమని.. ఆ సమయంలో సినిమాల గురించి తమ మధ్య చర్చ వచ్చేదే కాదని సూర్య తెలిపాడు. కానీ చివరకు ముగ్గురుం ఇండస్ట్రీలోకే వచ్చామని.. తామంతా మంచి స్థాయిలో ఉండటం చాలా ఆనందంగా ఉందని సూర్య అభిప్రాయపడ్డారు.
ఇక యువన్ శంకర్ రాజా దాదాపుగా తాను నటించిన పది సినిమాలకు వర్క్ చేశాడని.. అయితే మహేష్ బాబుతో కలిసి యాక్ట్ చేసే అవకాశం మాత్రం ఇంత వరకు రాలేదని సూర్య చెప్పుకొచ్చాడు. భవిష్యత్తులో మంచి కథ దొరికితే మాత్రం కచ్చితంగా ఇద్దరం కలిసి సినిమా చేస్తామని తెలిపాడు. ఇక సూర్య, మహేష్ బాబు మధ్య ఉన్న బాండింగ్ గురించి తెలుసుకుని అభిమానులు ఆశ్చర్యపోతున్నారు.