డైరెక్టర్ కృష్ణవంశీ తెరకెక్కించిన అద్భుతమైన చిత్రాల్లో చందమామ ఒకటి. ఈ మూవీలో శివ బాలాజీ, నవదీప్ హీరోలుగా నటించగా.. కాజల్ అగర్వాల్, సింధు మీనన్ హీరోయిన్లుగా చేశారు. 2007లో విడుదలైన చందమామ చిత్రం మంచి విజయాన్ని అందుకుంది. చందమామ తర్వాత కాజల్ అగర్వాల్ స్టార్ హీరోయిన్ అయింది. కానీ మరొక హీరోయిన్ సింధు మీనన్ మాత్రం 2009 తర్వాత ఇండస్ట్రీలో కనుమరుగైపోయింది. అసలు సింధు మీనన్ ఏమైపోయింది..? ఇప్పుడు ఎలాంటి స్థితిలో ఉంది..? అనే విషయాలు తెలుసుకుందాం పదండి.
బెంగళూరులో మలయాళీ కుటుంబంలో జన్మించిన సింధు మీనన్.. చిన్నతనంలోనే భరత నాట్యం లో శిక్షణ తీసుకున్నది. ఒకానొక భరత నాట్యం పోటీలలో సింధు మీనన్ విజేతగా నిలిచింది. ఆ భరతనాట్య పోటీకి న్యాయనిర్ణేతగా వ్యవహరించిన భాస్కర్ హెగ్డే ఆమెను కన్నడ దర్శకుడు కె.వి. జయరాం కు పరిచయం చేశారు. ఆయన 1994లో రష్మి అనే కన్నడ సినిమాతో సింధు మీనన్ ను చైల్డ్ ఆర్టిస్ట్ గా ఇండస్ట్రీలోకి లాంచ్ చేయడం జరిగింది.
13 సంవత్సరాల వయస్సులో ఉన్నప్పుడు ప్రేమ ప్రేమ ప్రేమ అనే కన్నడ మూవీతో హీరోయిన్ గా మారిన సింధు మీనన్.. 2001లో భద్రాచలం సినిమాతో తెలుగు ఇండస్ట్రీలోకి అడుగు పెట్టింది. ప్రధానంగా మలయాళం, కన్నడ భాషల్లో సినిమాలు చేసింది. తెలుగులో శ్రీరామ చంద్రులు, ఆడంటే అదో రకం, చందమామ, ఇంద్రధనస్సు వంటి సినిమాల్లో మెరిసింది. తమిళంలో కూడా అడపా తడపా చిత్రాల్లో నటించిన సింధు మీనన్.. 2010లో తమిళనాడుకి చెందిన ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ప్రొఫెషనల్ ప్రభుని వివాహం చేసుకుంది.
పెళ్లి తర్వాత భర్త కోరిక మేరకు ఆమె యాక్టింగ్ కు గుడ్ బై చెప్పేసింది. 2009లో విడుదలైన తమిళ చిత్రం ఈరం తర్వాత.. 2012లో మంజడికూరు అనే మలయాళ మూవీలో సింధు మీనన్ కనిపించింది. అదే ఆమె చివరి చిత్రం. ఇకపోతే ప్రభు, సింధు మీనన్ దంపతులకు ముగ్గురు సంతానం.. ఒకు కుమార్తె మరియు ఇద్దరు కుమారులు. ప్రస్తుతం భర్త, పిల్లలతో సింధు మీనన్ యూకేలో హ్యాపీ లైఫ్ లీడ్ చేస్తోంది. సోషల్ మీడియాలో చాలా యాక్టివ్ గా ఉంటే సింధు మీనన్.. ఎప్పటికప్పుడు తన ఫ్యామిలీ ఫోటోలను ఇన్‌స్టా ద్వారా పంచుకుంటూ ఉంటుంది.