తెలుగు సినీ పరిశ్రమలో రీ రిలీజ్ ట్రెండ్ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. గతంలో ఘన విజయం సాధించిన చిత్రాలు మళ్లీ థియేటర్స్ కు వరుసగా క్యూ పడుతున్నాయి. ఇప్పుడు ఈ జాబితాలో విక్రమార్కుడు సినిమా కూడా చేరబోతోంది. దర్శకధీరుడు రాజమౌళి తెరకెక్కించిన యాక్షన్ మూవీ ఇది. ఈ చిత్రంలో మాస్ మహారాజా రవితేజ, అనుష్క శెట్టి జంటగా నటించారు. శ్రీ కీర్తి క్రియేషన్స్ బ్యానర్ పై ఎం. ఎల్ కుమార్ చౌదరి నిర్మించిన విక్రమార్కుడు చిత్రం.. 2006 జూన్ 23న విడుదలై విమర్శకుల నుంచి ప్రశంసలు అందుకుంది.
అత్తిలి సత్తిబాబు అనే దొంగగా, విక్రమ్ సింగ్ రాథోడ్ అనే పవర్ ఫుల్ పోలీస్ ఆఫీసర్ గా రెండు విభిన్నమైన పాత్రల్లో రవితేజ చెలరేగిపోయాడు. రాజమౌళి స్క్రీన్ ప్లే, అనుష్క శెట్టి అందాలు, కీరవాణి అందించిన సంగీతం, సాంగ్స్, కామెడీ ట్రాక్, అజయ్-వినీత్ కుమార్ విలనిజం సినిమాను మరో స్థాయికి తీసుకెళ్లాయి. తొలి ఆట నుంచే విక్రమార్కుడు హిట్ టాక్ ను సొంతం చేసుకుంది. 54 కేంద్రాలలో 100 రోజుల థియేట్రికల్ రన్ సాధించింది.
అలాగే రూ. 12 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన ఈ చిత్రం ఫుల్ రన్ లో రూ.18.95 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు దాదాపు రూ.7 కోట్ల రేంజ్ లో లాభాలను అందించింది. హిందీ, బెంగాలీ, కన్నడ, తమిళ భాషల్లో రీమేక్ చేయబడింది. ఇకపోతే ఇప్పుడు విక్రమార్కుడు చిత్రం మళ్లీ థియేటర్స్ లో సందడి చేసేందుకు సిద్ధమైంది. జూలై 27న ఈ సినిమాను అత్యంత నాణ్యమైన 4కేలో మళ్లీ విడుదల చేస్తున్నారు. దీనిపై అధికారిక ప్రకటన కూడా వచ్చింది. దీంతో మాస్ మాహారాజా ఫ్యాన్స్ సంతోషం వ్యక్తం చేస్తున్నారు.