ఏ సినిమాకైనా ఓపెనింగ్ ఎంతో క్లోజింగ్ డ్రామా కూడా అంతే. ఓపెనింగ్ ఆకట్టుకున్నట్టుగానేక్లైమాక్స్ సీన్ కూడా ప్రేక్షకుల గుండెల్లో నిలిచిపోవాలి. అప్పుడు ఒకటికి రెండు సార్లు థియేటర్ బాట పడతాడు ప్రేక్షకుడు. ఈ విషయం ఇప్పుడు మరింత ఎక్కువగా దర్శకులు కసరత్తు చేస్తున్నారు. ఎందుకంటే.. ఓటీటీ, సోషల్ మీడియా వంటివి పెరిగిపోవడంతో ప్రేక్షకులను రెండున్నర గంటల సేపు కుర్చీలోకూర్చోబెట్టడం.. దర్శకులకు సవాల్‌గా మారింది.
అయితే..ఈ సవాల్ ఇప్పుడే కాదు.. పాత రోజుల్లోనూ ఉండేది. కానీ.. అప్పట్లో సోషల్ మీడియా, ఓటీటీ వంటివి లేవు. అయినా.. సెంటిమెంటుకు ప్రేక్షకులు పడిపోయేవారు. దీంతో సినిమాలో క్లైమాక్స్ సీన్‌కు ప్రాధాన్యం ఉండేది. ఏ సినిమాలో అయినా హీరో హీరోయిన్లు మరణిస్తే ట్రాజడీ అనే అంటారు. అక్కినేని నటించిన దేవదాసు, లైలామజ్ను లాంటివి ఈ కోవలోకే వచ్చాయి. ఇవి హిట్టయ్యాయి.
కానీ, ఇదే మూస ధోరణి కొనసాగిన అనేక సినిమాలు ఫెయిలయ్యాయి. ఉదాహరణకు అన్నగారు నటించి న చిరంజీవులు చివరిలో దుఖాంతం అవుతుంది. కానీ, ఆ సినిమా ఫెయిల్ అయింది. ఇక, కమల్ హాసన్ నటించిన అమావాస్య చంద్రుడు సినిమా కూడా ముందు హీరోను చంపేయాలని అనుకున్నారు. కానీ, ప్రేమికులిద్దరూ విడిపోతే ఎలా ఉంటుందని నిర్మాత, హీరో కమల్‌హాసన్, దర్శకుడు సింగీతం శ్రీనివాసరావుకు ఆలోచన వచ్చింది. దీంతో రెండు వెర్షన్‌లూ తీశారు.
ఆ రెండు వెర్షన్లూ చూసిన సినీ పెద్దలు, సుఖాంతమే బాగుందన్నారు. గొప్ప దర్శక నిర్మాత ఎల్.వి.ప్రసాద్ కూడా ఆ మాటే అన్నారట. ఆయన అందులో కీలక పాత్ర పోషించారు. హీరోయిన్‌కి తాతగా. ఇక, మణిరత్నం తీసిన గీతాంజలిలో కూడా మరణాన్ని చూపించలేదు. కానీ, సినిమా మాత్రం ఈ కోణంలోనే ముగుస్తుంది.
చిరంజీవి నటించిన ఠాగూర్ తమిళ సినిమా రమణ మూవీకి రీమేక్ అన్న సంగతి తెలిసిందే. తమిళంలో హీరో విజయకాంత్‌కు ఉరిశిక్ష పడుతుంది. కానీ, తెలుగులో వచ్చిన ఠాకూర్‌లో చిరంజీవికి జైలు శిక్ష విధిస్తారు. దీనికి కారణం.. ఇక్కడ చిరుకు ఉన్న ఫాలోయింగే. ఇలా.. మొత్తానికి రెండు వెర్షన్‌లు తీసుకుని.. చివరకు ప్రేక్షకాభిరుచిని బట్టి.. దానిని ప్లే చేశారన్న మాట.