నటుడు… మాత్రమే కాదు.. అనేక క్యారెక్టర్ పాత్రలతో తెలుగు సినీ రంగంపై ప్రత్యేకమైన ముద్ర వేసుకున్నారు ప్రభాకర్‌రెడ్డి. అయితే ఆయన వ్యక్తిగత జీవితతంలో అనేక ఒడిదుడుకులు ఎదుర్కొన్నారు. ప్రభాకర్ రెడ్డి తెలంగాణకు చెందిన వ్యక్తి. మొదట ఆయన డాక్టర్‌గా పనిచేశారు. ఎంబీబీఎస్ చదువుతున్నప్పుడే స్టేజ్ నాటకాలు వేసి పాపులర్ అయ్యారు. ఆయన నాటకాలకు అగ్రనటుడు ఎస్వీ రంగారావు న్యాయ నిర్ణేతగా వచ్చి ప్రభాకర్ రెడ్డి నటన చూసి మంత్ర ముగ్ధులయ్యారు.
ఈ క్రమంలోనే తన కొత్త సినిమాలో పాత్ర ఉంది వేస్తావా ? అంటూ తన సొంత ఖర్చులతోనే మద్రాస్ తీసుకు వెళ్లారు. రెండు మూడు సినిమాల్లో క్యారెక్టర్ పాత్రలు వేశాక.. హీరోలకే ఎక్కువ క్రేజ్ ఉంటుందని తెలిసిన ప్రభాకర్‌రెడ్డి ఆ తర్వాత హీరో పాత్రల వైపు ఎంట్రీ ఇచ్చారు. అలా ఒకటి రెండు ఆఫర్లు వచ్చాయి.. అనంతరం అనూహ్యంగా ఆయన సినిమా ఛాన్సులు తగ్గిపోయాయి.
ఇటు ఎంబీబీఎస్ చదివినా అప్పటికే ప్రభాకర్‌రెడ్డి నాలుగేళ్ల పాటు ప్రాక్టీస్‌కు దూరంగా ఉండడంతో వృత్తివైపు వెళ్లలేదు. అదే టైంలో ఆయన మద్రాస్‌లో ఉంటోన్న రూంకు అద్దె కూడా చెల్లించలేని పరిస్థితి వచ్చింది. దీంతో జీవితంపై విరక్తి చెందిన ఆయన సూసైడ్ నోట్ రాసుకుని తలకింద పెట్టుకున్నారట. అదే రూంలో ఉన్న బాలకృష్ణకు విషయం తెలిసింది. వెంటనే ఈ విషయాన్ని ఆయన అన్నగారు ఎన్టీఆర్‌కు చెప్పారు.
వెంటనే ఎన్టీఆర్ ప్రభాకర్ రెడ్డిని పిలిచి మందలించి తన సినిమాల్లో వేషం ఇప్పించారట. అప్పటి నుంచి ప్రభాకర్ రెడ్డి మళ్లీ వెనక్కు తిరిగి చూసుకునే అవకాశం లేకుండా దూసుకుపోయారు. అలా సినిమాల్లో ఆయన బిజీ అయిపోయారు. అయితే ప్రభాకర్ రెడ్డి తన వారసులను మాత్రం సినిమాల్లోకి తీసుకురాలేదు.