రాయన్ ( ధనుష్)కు 50వ సినిమా.. పైగా ఈ సినిమాకు ధనుషే దర్శకుడు కావడంతో ఈ సినిమాపై ఆసక్తి మామూలుగా లేదు. ఇక సందీప్ కిషన్ కూడా ఉండడంతో తెలుగు ఆడియెన్స్‌కు కూడా ఈ సినిమా చూడాలన్న కుతూహలం కలిగింది. ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ సినిమా ప్రేక్షకుల అంచనాలు అందుకుందో లేదో చూద్దాం.
రాయన్ ( ధనుష్ ) కి ఇద్దరు తమ్ముళ్లు, ఓ చెల్లాయి ఉంటారు. చిన్నప్పుడే అమ్మానాన్న దూరం అవడంతో తన తమ్ముడు చెల్లితో కలిసి మరో ఊరు వచ్చి అక్కడే రెక్కల కష్టంతో వాళ్ళని పెంచి పోషిస్తూ ఉంటాడు. ఒక తమ్ముడు ముత్తు ( సందీప్ కిషన్) కు దూకుడు ఎక్కువ.. అక్కర్లేని గొడవలలో ఇరుక్కుంటూ ఉంటాడు. అదే ఊరిలో దొరై – సేతు అనే రెండు వర్గాలు కూడా ఉంటాయి. ఆ రెండు వర్గాలకు అస్సలు పడదు. వారిద్దరి మధ్య గొడవలోకి ముత్తు వెళతాడు.. అది ముత్తు ప్రాణాలపైకి తీసుకువస్తుంది. ఇక రాయ్ కథ మరోలా ఉంటుంది.. తాను ఎవరి జోలికి వెళ్ళడు.. ఎవరైనా తన కుటుంబం జోలికి వస్తే ఊరుకోడు… ఈ క్రమంలోనే రాయన్ తన తమ్ముళ్లు, చెల్లిని కాపాడుకునేందుకు ఏం చేశాడు ? ఎలాంటి పరిస్థితులు ఎదుర్కొంటాడో ? అన్నదే ఈ సినిమా కథ.
విశ్లేషణ :
ఇక రాయన్ లాంటి కథలు మనం కూడా చాలా సార్లు చూసేసాం.. కాకపోతే ఆ ఎమోషన్ కంటూ ఓ బలం ఉంటుంది. అందుకే ఎన్నిసార్లు ఇలాంటి కథను చెప్పినా.. మళ్లీ చెప్పాలనిపిస్తుంది. కథను చాలా సింపుల్ గా మొదలు పెట్టాడు దర్శకుడు.. బాల్యం, తాను పడే కష్టాలు చాలా పాత సినిమాలనే గుర్తు చేస్తుంది. ఆ తర్వాత రెండు వర్గాలు వాళ్ల మధ్య గొడవలు మధ్యలోకి రాయన్ తమ్ముడు సందీప్ కిషన్ దూరడం.. ఇలా కథని చాలా ఆసక్తిగా నడిపాడు.. ఎక్కడా హీరోయిజం.. బిల్డప్పులు లేకుండా కథకు ఎంత కావాలో అంతే చెబుతూ చాలా షార్ప్ గా కథనాన్ని ముందుకు తీసుకువెళ్లాడు.
సినిమా ఫస్ట్ ఆఫ్ లో పెద్దగా లోపాలు ఏం కనిపించవు.. అప్పటికే ప్రేక్షకుడికి మంచి ఇంప్రెషన్ ఉంటుంది. అయితే సెకండ్ హాఫ్ లో దానిని కంటిన్యూ చేసే విషయంలో ధనుష్ కాస్త తడబడినట్టు అనిపిస్తుంది. అప్పటివరకు రాయన్ – సేతు కథ కాస్త రాయన్‌కి తన తమ్ముళ్ళకి మధ్య వైరంగా మారుతుంది. అయితే తమ్ముళ్లు రాయన్‌కు వైరంగా మారటానికి బలమైన కారణం లేదు. చాలా రొటీన్ గా ఉంటుంది.. క్లైమాక్స్ కూడా అంచనాలకు అనుగుణంగానే ఉంటుంది. ఇక సినిమాలో ధనుష్ గెటప్ కొత్తగా ఉంది.. ఈ సినిమాలో చాలా సైలెంట్ గా ఎక్కువగా మాట్లాడడు.. తన పని తాను చేసుకుంటూ కళ్ళతో హావభావాలు పలికించుకుంటూ వెళతాడు.
హీరోయిన్ లేకుండా… రొమాన్స్ లేకుండా పూర్తిగా డి గ్లామర్ పాత్రలో ఒకే టెంపోలో ఆ పాత్రని నడిపించిన విధానం మెస్మరైజ్ చేస్తుంది. ధనుష్ పాత్ర తర్వాత సందీప్ కిషన్ కి మంచి మార్కులు పడతాయి. బాగా ఎంటర్టైన్ చేశాడు.. కాస్త అటు ఇటుగా గెస్ట్ రోల్. అయితే వరలక్ష్మి శరత్ కుమార్ పాత్ర ప్రేక్షకులకు బాగా రిజిస్టర్ అవుతుంది. ఇక ధనుష్ దర్శకుడిగా కంటే సినిమాలో నటుడిగా బాగా సక్సెస్ అయ్యాడు. సినిమా అంతా ఒకే మూడ్‌లో నడిపించడం అంత తేలికైన విషయం కాదు. ఇక్కడే ధనుష్‌కు మంచి మార్కులు పడ్డాయి. టెక్నికల్‌గా సినిమా బాగుంది. రెహమాన్ ఇచ్చిన నేపథ్య సంగీతం బాగుంది.. ఓవరాల్ గా సినిమా ఫస్ట్ అఫ్ చాలా బాగుంది.. సెకండ్ హాఫ్ దానిని కంటిన్యూ చేయటంలో ధనుష్ తనబడిన క్లైమాక్స్‌లో మళ్ళీ ట్రాక్ లోకి వచ్చాడు. ఓవరాల్ గా ఒకసారి చూడదగిన కంటెంట్ అయితే సినిమాలో ఉంది.
ఫైనల్ పంచ్ : ధనుష్ ఫ్యాన్స్ మెచ్చే రాయన్
రాయన్ రేటింగ్ : 2.25 / 5
వడ్డె మారెన్న