పరిచయం :
సౌత్ ఇండియన్ సినిమా స్టామినాని దేశం మొత్తం పరిచయం చేసిన దర్శకుడు తమిళ దర్శకుడు శంకర్ ఇప్పుడు అందరూ రాజమౌళి, ప్రశాంత్ నీల్, నాగ్ అశ్విన్ అంటూ వీళ్ళ జపం చేస్తున్నారు.. కానీ ఒకప్పుడు దక్షిణ భారతదేశం అంతా బాలీవుడ్‌కు పోటీ ఇవ్వాలంటే శంకర్ పేరు మాత్రమే చెప్పేది. జీన్స్ – ప్రేమికుడు – జెంటిల్మెన్ – ఒకే ఒక్కడు – భారతీయుడు లాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాలు తీస్తున్న టైంలో అసలు ఈ మనిషి ప్లాప్ సినిమా అన్నది తీయడా అన్నంత ఆశ్చర్యం ప్రతి ఒక్కరికి కలిగించారు. శంకర్ సామాజిక అంశానికి కమర్షియల్ హంగులు అద్ది సినిమాను సూపర్ హిట్ చేయటంలో అందివేసిన చేయిగా పేరు పొందారు. అసలు విజువల్ గ్రాండ్ ఇయర్ అంటే ఎలా ఉంటుందో ? ఈ తరం సినిమా ప్రేక్షకులు అందరూ శంకర్‌ని చూసి నేర్చుకునేవారు. రోబో సినిమా తర్వాత శంకర్ నుంచి ఆ స్థాయి సూపర్ డూపర్ హిట్ సినిమా రాలేదు. 2.0 సినిమా వచ్చిన అది ఎబో యావరేజ్ సినిమా. ప్రస్తుతం కమలహాసన్ తో భారతీయుడు 2, రామ్ చరణ్ తో గేమ్ ఛేంజర్ సినిమాలు రెండు శంకర్ ఏకకాలంలో తెరకెక్కించారు. ఇక 28 సంవత్సరాల తర్వాత భారతీయుడు సినిమాకు భారతీయుడు 2 సినిమా తెరకెక్కింది. కాంబినేషన్ పరంగా క్రేజీ కాంబినేషన్ గా పేరు తెచ్చుకున్న ఈ సినిమా ఈరోజు ప్రేక్షకుల ముందుకు వచ్చింది. మరి ఈ సినిమాతో శంకర్ తన మ్యాజిక్ ఎంతవరకు ? చూపించాడు అన్నది సమీక్షలో చూద్దాం.
స్టోరీ :
చిత్ర ( సిద్ధార్థ్ ) ఓ యూట్యూబర్. సమాజంలో జరిగే అన్యాయాలు.. అవినీతిని ప్రశ్నిస్తూ స్నేహితులతో కలిసి ఓ యూట్యూబ్ ఛానల్ రన్ చేస్తూ ఉంటాడు. అతడు అన్యాయంపై.. అవినీతిపై ఎన్ని పోరాటాలు చేసినా అవినీతి తగ్గదు. ఈ క్రమంలోనే తన పోరాటం సరిపోదని భావించి ఒకప్పుడు లంచగొండిల గుండెల్లో దడ పుట్టించిన భారతీయుడు రావాలని పిలుపు ఇస్తాడు. అందుకే సోషల్ మీడియాలో కం ఇండియన్ పేరుతో పెద్ద ఉద్యమం మొదలు పెడతాడు. ఇవన్నీ చూసిన సేనాపతి మళ్ళీ రంగంలోకి దిగుతాడు. ఈసారి కూడా సేనాపతి దేశంలో ఉన్న అవినీతిని.. కుళ్ళుని కడిగేసాడా ? మార్పును తీసుకు వచ్చాడా ? ఈసారి సేనాపతికి ఎలాంటి సవాళ్లు ఎదురయ్యాయి అన్న ప్రశ్నలకు సమాధానమే భారతీయుడు 2 సినిమా.
విశ్లేషణ :
భారతీయుడు సినిమా వచ్చి 28 ఏళ్లు అయిపోయింది. అది ఎలాంటి సూపర్ డూపర్ హిట్ సినిమాయో.. భారతీయ సమాజంపై ఎలాంటి ప్రభావం చూపించిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఇప్పుడు అలాంటి సినిమాకు సీక్వెల్ వస్తుంది అంటే ప్రేక్షకులు కళ్ళు కాయలు కాచేలా ఎదురు చూశారు. భారతీయుడు సినిమా వచ్చిన టైముకు అవినీతి అనేది కొత్త సబ్జెక్టు. దేశంలో ఇంత అవినీతి జరుగుతుందా ? అన్న ఆలోచన అప్పట్లో ఎక్కువగా జరిగింది. అయితే ఇప్పుడు అవినీతి అన్నది కామన్ అయిపోయింది. అవినీతి మీద చాలా సినిమాలు వచ్చేసాయి. ఇక ఈ సినిమా విషయానికి వస్తే మళ్లీ అలాంటి కథను చెప్పాలని శంకర్ చేసిన ప్రయత్నం అంతగా ఆకట్టుకోలేదు.
భారతీయుడు సినిమాలో ఎమోషన్ బాగా ఉంటుంది. ఈ సినిమా ఎమోషన్ పాత్రల వరకు కనిపిస్తుందే తప్ప.. ప్రేక్షకుల్లో మచ్చుకైనా కనిపించదు. సినిమా ప్రారంభమైన అరగంట వరకు అసలు కమల్ పాత్ర తెరమీద కనిపించదు. భారతీయుడులో సేనాపతి పాత్ర చాలా హుందాగా.. గంభీరంగా ఉంటే ఇక్కడ ఆ రెండు మిస్ అయిపోయాయి. పైగా రకరకాల గెటప్పుల్లో సేనాపతిని చూపించడంతో ఆ పాత భారతీయుడి గాంభీర్యం ఎక్కడా ఏ మాత్రం కనిపించలేదు. భారతీయుడు వచ్చి అవినీతిపరులను చంపటం స్పీచ్ లు.. ఉపన్యాసాల దంచి కొట్టడం తప్ప పాత్రలో ఎమోషన్ డ్రైవ్ కానీ ప్రేక్షకులు కనెక్ట్ అవ్వడం కానీ అస్సలు లేదు. భారతీయుడులో తన కొడుకుని తన చేతిలో చంపుకుంటాడు సేనాపతి.. అక్కడ చెప్పింది ఇక్కడ చెబుతానని శంకర్ అంటే ఎలా ? అందుకే చివర్లో గో బ్యాక్ ఇండియన్ అంటూ సేనాపతిని దేశ ప్రజలు తరిమి కొడతారు.
సేనాపతి లైవ్ లో మర్డర్లు చేస్తుంటే సిబిఐ మొత్తం కల్లప్పగించి చూస్తుందే తప్ప అది తెరమీద చూస్తున్న ప్రేక్షకుడికి నీరసం వస్తుంటుంది. సేనాపతి అప్డేట్ అయినా సిబిఐ అవలేదు ఏంటి అనే డౌటు వస్తుంది. ఇక మర్మకళని కూడా శంకర ఇష్టం వచ్చినట్టు వాడటం ఈ తరం ప్రేక్షకులకు పెద్దగా కనెక్ట్ కాలేదు.
పైగా చివర్లో భారతీయుడు 3 సినిమా ఎలా ఉండబోతుందో ? చూపించారు. అది చూస్తే శంకర్ ఈ కథని రెండు భాగాలుగా విడగొట్టి తప్పు చేశాడని.. రెండు భాగాల కథని ఒకే సినిమాలు చెప్పి ఉంటే క్రిస్పీగా బాగుండేదేమో అనిపిస్తుంది. ఇప్పుడు భారతీయుడు పార్ట్ 3 వచ్చిన ప్రేక్షకులకు చూడాలన్న ఆసక్తి అయితే ఉండదు. ఇక సినిమాలో కమలహాసన్ స్క్రీన్ ప్రజెన్స్ బాగుంది.. తన పాత్రకు బాగా న్యాయం చేశారు. అయితే ఆయన్ను దర్శకుడు శంకర్ సరిగా వాడుకోలేదు.
సిద్ధార్థ్‌కి సినిమా అంతా ఉన్న మంచి పాత్ర దొరికింది. ఇక రకుల్ ప్రీత్ సింగ్ … బ్రహ్మానందం లాంటివాళ్ళు ఉన్న లేనట్టే. బాబీ సింహా సినిమా అంతా హీరోని పట్టుకోడానికి ప్రయత్నిస్తూ ఫెయిల్ అయ్యే రెగ్యులర్ పాత్రలో కనిపించాడు. భారతీయుడు సినిమాలో పచ్చని చిలుకలు – టెలిఫోన్ ధ్వనిలా నవ్వేదాన లాంటి పాటల వచ్చి 28 ఏళ్లు అయినా ఇప్పటికీ కొత్తగానే ఉంటాయి. అయితే భారతీయుడు 2 సినిమా విషయంలో అనిరుధ్ డిజాస్టర్ పెర్ఫార్మన్స్ ఇచ్చాడు. శంకర్ కూడా వేలాదిమంది జూనియర్ ఆర్టిస్టులతో సెట్లు నింపాడే తప్ప.. విపరీతంగా ఖర్చు పెట్టించినా.. కథ, కథనం మీద దృష్టి పెట్టలేదు. కథ – స్క్రీన్ ప్లే విషయంలో దారుణంగా తేలిపోయాడు. దీంతో తెరపై ఎన్ని హంగులు ఉన్నా సినిమా మనసుకి ఎక్కలేదు. ఏది ఏమైనా ఈ సినిమా చూశాక శంకర్ గో బ్యాక్ అనుకోవడం తప్ప చేయటానికి ఏమీ మిగలదు.
భారతీయుడు 2 TL రేటింగ్ : 2 / 5
ఫైనల్ పంచ్ : శంకర్ గో బ్యాక
వడ్డె మారెన్న