టాలీవుడ్ లో ఉన్న హైయెస్ట్ పెయిడ్ యాక్టర్స్ లో సూపర్ స్టార్ మహేష్ బాబు ఒకరు. ప్రభాస్, ఎన్టీఆర్, రామ్ చరణ్, అల్లు అర్జున్ వంటి పాన్ ఇండియా హీరోలు రూ. 100 కోట్ల రేంజ్ లో రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. కానీ మహేష్ ఇంతవరకు ఒక్క పాన్ ఇండియా సినిమా కూడా చేయలేదు. అయినా సరే ఆయా హీరోలకు ధీటుగా పారితోషికం అందుకుంటుండటం మహేష్ బాబు క్రేజ్ కు నిదర్శనం.
అలాంటి మహేష్ బాబు తన కెరీర్ లో పైసా రెమ్యునరేషన్ తీసుకోకుండా చేసిన చిత్రం ఏదో తెలుసా.. టక్కరి దొంగ. అసలు ఈ సినిమాకు మహేష్ రెమ్యునరేషన్ ఎందుకు తీసుకోలేదు..? ఆ కథేంటి..? అన్నది ఇప్పుడు తెలుసుకుందాం. ప్రేమించుకుందాం రా, బావగారు బాగున్నారా వంటి సూపర్ హిట్ సినిమాలు తీసిన డైరెక్టర్ జయంత్ సి. పరాంజీ, మహేష్ బాబు కాంబోలో తెరకెక్కిన ప్రయోగాత్మక చిత్రమే టక్కరి దొంగ.
ఇందులో లీసా రే, బిపాసా బసు హీరోయిన్లుగా నటించారు. ఈ సినిమాకు జయంత్ దర్శకుడిగానే కాకుండా రచయితగా, నిర్మాతగా కూడా వ్యవహరించారు. మణి శర్మ స్వరాలు సమకూర్చారు. ఈ మూవీ షూటింగ్ మొత్తం యునైటెడ్ స్టేట్స్లోనే జరిగింది. టక్కరి దొంగ కోసం మహేష్ బాబు ఎంతగానో శ్రమించాడు. అత్యంత క్లిష్టమైన సన్నివేశాల్లో కూడా డూప్ లేకుండా తానే స్వయంగా యాక్ట్ చేశాడు.
అయితే అత్యంత భారీ బడ్జెట్ తో నిర్మితమైన టక్కరి దొంగ చిత్రం.. 2002లో విడుదలై డిజాస్టర్ గా నిలిచింది. ఎన్నో ఆశలతో, ఎంతో నమ్మకంగా సినిమాను తీసిన జయంత్ రిలీజ్ తర్వాత అప్పుల్లో కూరుకుపోయారు. పైగా అప్పటికి మహేష్ బాబుకి ఇంకా రెమ్యునరేషన్ కూడా ఇవ్వలేదు. ఎంతోకొంత ఇవ్వాలి కాబట్టి మహేష్ కి గుర్తు చేయగా.. నీకేమైనా పిచ్చి పట్టిందా, రెమ్యునరేషన్ వద్దు ఏం వద్దంటూ జయంత్ తో అన్నాడట. సినిమా కోసం ఎంతో కష్టపడినప్పటికీ టక్కరి దొంగ కోసం మహేష్ పైసా కూడా తీసుకోలేదు. ఈ విషయాన్ని గతంలో ఓ ఇంటర్వ్యూలో జయంత్ స్వయంగా బయటపెట్టారు. మహేష్ గొప్ప మనసుపై ఆయన ప్రశంసలు కురిపించారు.