సినీ తారలు తమ పేరును మార్చుకోవడం అనేది పెద్ద వింతేమి కాదు. ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత న్యూమరాలజీ ప్రకారం కొందరు, సక్సెస్ కోసం మరికొందరు, స్క్రీన్ నేమ్ బాగుండాలని ఇంకొందరు తమ పేరును మార్చుకుంటూ ఉంటారు. టాలీవుడ్ లో కూడా పేరు మార్చుకున్న హీరోలు చాలామందే ఉన్నారు.
ఈ జాబితాలో మొదట చెప్పుకోవాల్సిన వ్యక్తి మెగాస్టార్ చిరంజీవి. ఆయన అసలు పేరు కొణిదెల శివశంకర వరప్రసాద్. సినిమా పరిశ్రమలోకి వచ్చిన తర్వాత శివశంకర వరప్రసాద్ అనే పేరు చాలా పెద్దగా ఉందని ఆయనకు అనిపించింది. పైగా అప్పటికే శంకర్, శివ, ప్రసాద్ పేర్లతో కొందరు నటులు ఉన్నారు. ఈ నేపథ్యంలోనే పేరు మార్చుకోవాలని భావించారు. ఆంజనేయస్వామికి పరమభక్తుడైన శివశంకర వరప్రసాద్.. ఆయనకు మరో పేరైనా చిరంజీవిని తన స్క్రీన్ నేమ్‌గా పెట్టుకున్నారు.
చిరంజీవి తమ్ముడు పవన్ కళ్యాణ్ కూడా సినిమాల్లోకి వచ్చాక పేరు మార్చుకున్నారు. బహుశా చాలా మందికి ఈ విషయం తెలిసుండకపోవచ్చు. తల్లిదండ్రులు ఆయనకు పెట్టిన పేరు కళ్యాణ్ కుమార్ కాగా.. పవన్ కళ్యాణ్ గా మార్చుకున్నారు.
ఎటువంటి సినీ బ్యాక్‌గ్రౌండ్ లేకుండా ఇండస్ట్రీలోకి వచ్చిన స్టార్ గా ఎదిగిన న్యాచురల్ నాని కూడా తన నేమ్ ను ఛేంజ్ చేసుకున్నారు. ఆయన ఒరిజినల్ నేమ్ ఘంటా నవీన్ బాబు. చిత్ర పరిశ్రలోకి వచ్చాక నానిగా మారాడు.
మెగాస్టార్ చిరంజీవి మేనల్లుడిగా ఇండస్ట్రీలోకి వచ్చి హీరోగా నిలదొక్కుకున్న సాయి ధరమ్ తేజ్.. ఇటీవలె తన పేరులో కొన్ని మార్పులు చేశారు. తన తల్లి పేరును యాడ్ చేసుకుని సాయి దుర్గ తేజ్ గా నేమ్ ఛేంజ్ చేసుకున్నారు.
ఇండస్ట్రీలోకి వచ్చిన తర్వాత పేరు మార్చుకున్న హీరోల్లో మాస్ మహారాజా రవితేజ ఒకరు. ఆయనకు తల్లిదండ్రులు పెట్టిన పేరు భూపతిరాజు రవిశంకర్ రాజు. ఆ తర్వాత షార్ట్ గా రవితేజగా మార్చుకున్నారు.
ఇక వీళ్లే కాకుండా మన మాస్ కా దాస్ దినేష్ నాయుడుగా ఉన్న తన పేరును విశ్వక్ సేన్ గా మార్చుకున్నాడు. డైనమిక్ డైరెక్టర్ పూరీ జగన్నాథ్ తనయుడు ఆకాష్ పూరీ రీసెంట్ గా తన పేరును ఆకాష్ జగన్నాథ్ గా ఛేంజ్ చేసుకున్నాడు. మంచు భక్తవత్సలం నాయుడుగా ఉన్న వ్యక్తి మోహన్ బాబుగా పేరు మార్చుకున్నారు. జగపతి రావు చౌదరి జగపతి బాబుగా, సన్నీ చంద్ర అడివి శేష్‌గా పేరు మార్చుకున్నారు.