పైన ఫోటోలో మెగాస్టార్ చిరంజీవి ఒక బాబును ఎత్తుకొని షీల్డ్ ను అందజేస్తున్నారు. అయితే చిరంజీవి ఎత్తుకున్న ఆ చిన్నోడు ఇప్పుడు టాలీవుడ్ లో క్రేజీ హీరో. తొలి సినిమాతోనే హిట్ కొట్టి తెలుగు సినీ ప్రియులకు చేరవయ్యాడు. ప్రస్తుతం వరుస సినిమాలతో ప్రేక్షకులను అలరిస్తున్నాడు. ఇంతకీ ఆ హీరో ఎవరో గుర్తుపట్టారా.. డైలాగ్ కింగ్ సాయికుమార్ తనయుడు ఆది సాయికుమార్.
1991లో ముత్యాల సుబ్బయ్య దర్శకత్వంలో వచ్చిన కలికాలం మూవీ సూపర్ డూపర్ హిట్ అయింది. ఇందులో చంద్రమోహన్, జయసుధ జంటగా నటించగా.. సాయి కుమార్ కీలక పాత్రను పోషించారు. అయితే కలికాలం 100 రోజుల వేడుకకు మెగాస్టార్ చిరంజీవి ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా చిరంజీవి సాయి కుమార్ కు ఇవ్వాల్సిన షీల్డ్ ను ఆయన కొడుకు ఆదికి అందిజేశారు. ఆ టైమ్ లో తీసిన ఆరుదైన ఫోటోనే ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ గా మారింది.
ఆది సాయి కుమార్ విషయానికి వస్తే.. 2011లో ప్రేమ కావాలి మూవీతో హీరోగా ఇండస్ట్రీకి పరిచయం అయ్యాడు. తొలి సినిమాతోనే హిట్ కొట్టి అందరి దృష్టిని ఆకర్షించాడు. ఆ తర్వాత లవ్లీ, సుకుమారుడు వంటి చిత్రాలతో మరింత క్రేజ్ సంపాదించుకున్నాడు. అయితే కమర్షియల్ గా భారీ హిట్లు పడకపోవడం వల్ల ఆది స్టార్ హీరోల చెంత చేరలేకపోయాడు. కానీ ఇండస్ట్రీలో హిట్లు ఫ్లాపులతో సంబంధం లేకుండా వరుస సినిమాలు చేస్తున్న హీరోగా పేరు తెచ్చుకున్నాడు.
ప్రస్తుతం ఆది సాయి కుమార్ మూడు ఇంట్రెస్టింగ్ ప్రాజెక్ట్‌లతో బిజీగా ఉన్నాడు. అందులో కిరాతక ఒకటి కాగా.. మరొకటి అమరన్ ఇన్ ద సిటీ: చాప్టర్ 1. అలాగే తెలుగు, తమిళ భాషల్లో జంగిల్ అనే ద్విభాషా చిత్రం చేస్తున్నాడు. ఈ మూడు ప్రాజెక్ట్స్ ఇప్పుడు సెట్స్ మీదే ఉన్నాయి. గత ఏడాది CSI సనాతన్ అనే సినిమాతో పాటు పులి మేక అనే వెబ్ సిరీస్ తో ఆది ప్రేక్షకులను పలకరించాడు.