పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ బాహుబలి తర్వాత మళ్లీ ఆ స్థాయి విజయం ఇటీవల విడుదలైన కల్కి 2898 ఏడీ
తోనే దక్కింది. నాగ్ అశ్విన్ తెరకెక్కించిన ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వీర విహారం చేస్తోంది. మూడో వారానికే రూ. 1000 కోట్ల క్లబ్ లో చేరడమే కాకుండా ఇంకా విజయవంతంగా ప్రదర్శింపబడుతోంది. అటువంటి కల్కి చిత్రంపై సీనియర్ నటుడు సుమన్ తాజాగా షాకింగ్ రివ్యూ ఇవ్వడం చర్చినీయాంశమైంది.
ఓ ఇంటర్వ్యూలో పాల్గొన్న సుమన్.. కల్కి సినిమాపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు. కల్కి సినిమా నచ్చిందా అని యాంకర్ ప్రశ్నించగా.. ఫస్టాఫ్ ల్యాగ్ ఎక్కువుందని, సాంగ్స్ పరమ చెత్తగా ఉన్నాయని సుమన్ తేల్చేశారు. ఆయన మాట్లాడుతూ.. `ఫ్రాంక్‍గా చెప్పాలంటే కల్కి మూవీ చాలా నెమ్మదిగా అనిపించింది. ఒక అరగంట తీసేయొచ్చు. ముఖ్యంగా ఆ బాంబే హీరోయిన్ (దిశా పటానీ) సాంగ్, ఫైట్ సీన్ వేస్ట్. వాటిని లేపేయొచ్చు. కథతో వాటికి సంబంధం లేదు.
సెకండాఫ్ మేకింగ్, ఫ్యూచరిస్టిక్ అదంతా బావుంది. డైరెక్టర్ విజన్‌కి సెల్యూట్ చెప్పాల్సిందే. నాగ్ అశ్విన్ హాలీవుడ్ లెవల్ సినిమాను పరిచయం చేశారు. అయితే సినిమాలో అమితాబ్ బచ్చన్ పాత్ర డామినేషన్ ఎక్కువగా కనిపించింది. నాకు ప్రభాస్ అంటే చాలా ఇష్టం. ప్రభాస్ కు మంచి ఫిజక్ ఉంది. కాబట్టి, ఆయన్ను ఒక టార్జాన్‌లా చూపించాలి. కానీ ఆయనకి ఏదో ప్లేట్ పెట్టి, షీల్డ్ పెట్టి బాడీ కవర్ చేసేశారు. ప్రభాస్ మజిల్స్ చూపించే సీన్ ఎక్కడైనా వస్తుందేమోనని ఎదురుచూస్తే ఎక్కడా లేదు. సాంగ్స్ అస్సలు బాలేదు. ఒక డిఫరెంట్ యాంగిల్‌లో చూస్తేనే కల్కి నచ్చుతుంది.` అంటూ సుమన్ ఓపెన్ గా చెప్పుకొచ్చారు.
అలాగే కల్కిలో గెస్ట్ రోల్ చేసే అవకాశం వచ్చుంటే చేసేవారా అని యాంకర్ ప్రశ్నించగా.. సుమన్ ఆసక్తికర సమాధానం ఇచ్చారు. కల్కిలో నేను చేయగలిగే క్యారెక్టర్ అయితే అందులో నాకు ఏం కనిపించలేదు. మనం ఒక పాత్ర చేస్తే ప్రేక్షకులకు గుర్తుండిపోవాలి. అలాంటి పాత్రే నేను చేస్తాను అంటూ సుమన్ పేర్కొన్నారు. దీంతో ఇప్పుడు ఆయన కామెంట్స్ సామాజిక మాధ్యమాల్లో హాట్ టాపిక్ గా మారాయి.