బాలీవుడ్ నుంచి వచ్చి టాలీవుడ్ లో చాలామంది స్టార్ హీరోయిన్లు సినిమాలు చేసి సక్సెస్ అయ్యారు. అలా వాళ్ల బాటలోనే వాళ్ళ చెల్లెలు కూడా తెలుగులో కొన్ని సినిమాలు చేశారు. అక్కలు సూపర్ సక్సెస్ అయితే.. చెల్లెళ్లు అనుకున్నంత రేంజ్లో సక్సెస్ కాలేదు. తెలుగులో కే.రాఘవేంద్రరావు దర్శకత్వంలో వెంకటేష్ హీరోగా వచ్చిన సాహస వీరుడు.. సాగరకన్య.. సినిమాతో హీరోయిన్గా ఎంట్రీ ఇచ్చింది పొడుగు కాళ్ళ సుందరి శిల్పా శెట్టి. ఈ సినిమా తర్వాత తెలుగులో శిల్పాశెట్టికి మంచి క్రేజ్ వచ్చింది.
ఆ తర్వాత నాగార్జున సరసన ఆజాద్ సినిమాలోనూ బాలయ్యకు జోడిగా భలేవాడివి బాసు సినిమాల్లోను నటించింది. అలాగే మోహన్ బాబు సరసన వీడెవడండీ బాబు సినిమాలోను జోడి కట్టింది. ఈ సినిమాలు హిట్ కాకపోయినా శిల్పాశెట్టిని మాత్రం తెలుగు ప్రేక్షకులకు బాగా దగ్గర చేశాయి. ఇక శిల్పాశెట్టి బాలీవుడ్లో ఎక్కువ మార్కెట్ ఉండడంతో అక్కడే బాగా ఫోకస్ పెట్టింది. శిల్పా శెట్టి తెలుగులో ఎక్కువ సినిమాలు చేయడంతో ఆమె చెల్లి షమితా శెట్టి కూడా స్టార్ హీరోయిన్ అవ్వాలని అనుకుంది.
ఈ క్రమంలోనే తెలుగులో కోడి రామకృష్ణ దర్శకత్వంలో వచ్చిన పిలిస్తే పలుకుతా.. సినిమాలో హీరోయిన్గా జోడి కట్టింది. అయితే గ్లామర్ హీరోయిన్ గా పేరు తెచ్చుకోవాలని ఆశపడ్డ షమితకు.. ఈ సినిమా పెద్ద షాక్ ఇచ్చింది. ఇది భక్తి ప్రధానమైన సినిమా. స్కిన్ షోకి.. అందాల ఆరబోతకి.. ఈ సినిమాలో అంతగా ఆస్కారం లేదు. దీంతో షమితశెట్టి తెలుగులో మొదటి అడుగే రాంగ్ చాయిస్ అయింది. అలాగే ఈ సినిమా అనుకున్నంతగా సక్సెస్ కాలేదు. దాంతో అక్క పేరు చెప్పి తెలుగులో వెలుగు చూద్దామనుకున్న షమితశెట్టి కెరీర్ తొలి సినిమాతోనే అలా ముగిసిపోయింది.