యూనివర్సల్ స్టార్ కమల్ హాసన్, డైరెక్టర్ శంకర్ కాంబినేషన్‌లో వచ్చిన భారతీయుడు చిత్రం ఎంతటి సంచలన విజయాన్ని నమోదు చేసిందో ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. ఈ చిత్రానికి దాదాపు 28 ఏళ్ల తర్వాత సీక్వెల్ గా నేడు భారతీయుడు 2 విడుదల అయింది. లైకా ప్రొడక్షన్స్, రెడ్ జెయింట్ మూవీస్ బ్యానర్లపై నిర్మితమైన ఈ చిత్రంలో కమల్ హాసన్ ప్రధాన పాత్రను పోషించగా.. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్ సింగ్, ఎస్‌జె సూర్య, బాబీ సింహా తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. అనిరుధ్ రవిచందర్ మ్యూజిక్ అందించాడు.
భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన భారతీయుడు 2 చిత్రానికి షాకింగ్ రెస్పాన్స్ వస్తోంది. సినిమా చూసిన ప్రేక్షకులు సోషల్ మీడియా ద్వారా రివ్యూలు ఇచ్చేస్తున్నారు. సేనాపతి అయిన కమల్ హాసన్ అవినీతికి పాల్పడుతున్న కొడుకును చంపి విదేశాలకు వెళ్లిపోవడంతో భారతీయుడు ముగుస్తుంది. ఇప్పుడు సీక్వెల్ అక్కడి నుండే మొదలుపెట్టారు. దేశంలో పెరిగిపోతున్న అవినీతి మీద తన టీమ్ తో కలిసి సిద్ధార్థ్ వీడియోలు చేసి సోషల్ మీడియాలో పెడుతుంటారు. దాంతో విదేశాల నుండి కమల్ హాసన్ ఇండియాకు దిగుతాడు. మళ్లీ తన పోరాటం ప్రారంభిస్తాడు.
సుత్తి లేకుండా శంకర్ నేరుగా కథలోకి వెళ్లాడు. కమల్ హాసన్ ఎంట్రీ బాగుంటుంది. కానీ ఆయన వృద్దుడి గెటప్ ఫస్ట్ హాఫ్ లో మెప్పించలేకపోయిందని అంటున్నారు. అలాగే ఫస్ట్ హాఫ్ మొత్తంగా యావరేజ్‌గా ఉందని.. ఒకటి రెండు యాక్షన్ ఎపిసోడ్స్ మాత్రమే ఆకట్టుకున్నాయని చెబుతున్నారు. సెకండ్ హాఫ్ పర్లేదని అంటున్నారు. ఇంటర్వెల్ బ్లాక్, ఫైట్స్, క్లైమాక్స్ ట్విస్ట్, విజువల్స్ సూపర్‌గా ఉన్నాయని పోస్టులు పెడుతున్నారు. కమల్ హాసన్ మరోసారి తన విశ్వరూపం చూపించాడని.. సిద్ధార్థ్, రకుల్ ప్రీత్, ఎస్ జె సూర్య, బాబీ సింహ తమ పాత్రలకు న్యాయం చేశారని ప్రేక్షకులు అభిప్రాయపడుతున్నారు.
అనిరుధ్ మ్యూజిక్ పర్లేదని.. కానీ భారతీయుడు స్థాయి సాంగ్స్, మ్యూజిక్ ఆశించడం అత్యాశే అవుతుందట. సాగదీతతో కూడిన సన్నివేశాలు.. ఊహకందేలా స్క్రీన్ ప్లే ఉండటం, శంకర్ మార్క్ కనిపించకపోవడం మైనస్ అని చెబుతున్నారు. ఓవరాల్ గా భారతీయుడు 2 జెస్ట్ ఓకే ఫిల్మ్. శంకర్, కమల్ హాసన్ రేంజ్ అయితే కాదు. మరియు భారతీయుడు మూవీని మరిపించడంలో కూడా సీక్వెల్ విఫలం అయింది. దీంతో ప్రేక్షకుల నుంచి మిక్స్డ్ టాక్ సొంతం చేసుకుంటోంది.