Newsసీతారాముల క‌ళ్యాణ‌ము చూత‌ము రారండీ పాట రాసే ముందు ఎన్టీఆర్ పెట్టిన...

సీతారాముల క‌ళ్యాణ‌ము చూత‌ము రారండీ పాట రాసే ముందు ఎన్టీఆర్ పెట్టిన కండీష‌న్ ..?

అన్న‌గారు ఏదైనా సినిమా తీస్తే.. దానిలో ప్ర‌తి స‌న్నివేశాన్ని ఆయ‌న ముందుగానే ప‌రిశీలిస్తారు. అంకిత భావం ఉండాల‌ని చెబుతారు. తాను కూడా అలానే ఇన్వాల్వ్ అవుతారు. ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ.. అన్న‌గారి ముద్ర క‌నిపించేలా చేసుకుంటారు. అలాంటి టీంనే ఆయ‌న ఎంచుకుంటారు కూడా. ఒక్క‌రూపాయి కూడా వేస్ట్ కావ‌డానికి వీల్లేద‌ని చెబుతారు. అదేవిధంగా నిడివి కూడా అంతే ఉండాల‌ని.. తీసిన ప్ర‌తి ప్రేమ్ కూడా ఎడిట్ అవ్వ‌కుండా ఉండాల‌ని ప‌దే ప‌దే చెబుతారు. న‌టీన‌టుల హావ‌భావాల‌ను చాలా ద‌గ్గ‌ర‌గా ప‌రిశీలిస్తారు.

ఇలా అన్న‌గారు చేసిన స్వంత సినిమాలుప్ర‌తిదీ సూప‌ర్ హిట్ కొట్టాయి. బ్లాక్ అండ్ వైట్ అయినా.. క‌ల‌ర్ అయినా.. అన్న‌గారు మ‌న‌సు పెట్టి చేసేవారు. తొలినాళ్ల‌లో అన్న‌గారు చాలా సాహ‌సోపేత‌మైన సినిమాల‌కు ప్రాధాన్యం ఇచ్చారు. ముఖ్యంగా పౌరాణికా ల‌కు ఆయ‌న అగ్ర‌తాంబూలం ఇచ్చారు. అయితే.. ఆయ‌న సోద‌రుడు త్రివిక్ర‌మ రావు మాత్రం అంద‌రికీ తెలిసిన క‌థ‌లే తీస్తే.. ఏం పోతాయ్‌? అని పెద‌వి విరి చేవారు. దీనికి అన్న‌గారు.. మ‌నం తీసే వైవిద్యాన్ని బ‌ట్టి ఉంటుంది త‌మ్ముడూ. నీకేం భ‌యం వ‌ద్దు.. అంతా నేను చూసుకుంటాను అని భ‌రోసా ఇచ్చేవారు.

ఇలా తీసిన సినిమానే.. సీతారామ క‌ళ్యాణం. దీనిలో అన్న‌గారు ఎన్టీఆర్‌.. రావ‌ణాసురుడి పాత్ర‌ను పోషించారు. చాలా వైవిధ్యా న్ని ప్ర‌ద‌ర్శించారు.దాదాపు రావ‌ణాసురుడి జీవితాన్ని చూపించే ప్ర‌య‌త్నం చేశారు. ఇది ఎలా ఉన్నా.. రామాయ‌ణంలోని కీల‌క ఘ‌ట్టాల‌ను య‌థాత‌థంగా చిత్రీక‌రించే ప్ర‌య‌త్నం చేశారు. ఈ క్ర‌మంలో ఎక్క‌డా రాజీ ప‌డ‌లేదు. వాహినీ స్టూడియోను ఏడాది కాలం పాటు అద్దెకు తీసుకున్నారు. అప్ప‌ట్లో ఇంత సుదీర్ఘంగా అద్దెకు తీసుకున్న‌వారు ఎవ‌రూ లేర‌ని అంటారు. దీనిలో నే లంకా న‌గ‌రం సెట్ స‌హా సీతారాముల క‌ళ్యాణ మండ‌పాన్ని కూడా నిర్మించారు.

స‌రే.. సినిమా ఎలా ఉన్న‌ప్ప‌టికీ.. దీనిలో సీతారాముల క‌ళ్యాణం పాట‌కు వ‌చ్చేస‌రికి.. సినిమాలో చివ‌ర‌న చేర్చారు. దీనిని స‌ముద్రాల సీనియ‌ర్ ర‌చించారు. ఇప్ప‌టికీ ఎక్క‌డ పెళ్లి జ‌రిగినా.. శ్రీరామ న‌వ‌మి పందిళ్ల‌లో స‌హా ఆల‌యాల్లో మార్మోగే.. శ్రీ సీతారాముల క‌ళ్యాణ‌ము చూత‌ము రారండీ. పాట ఆబాల గోపాల‌న్నీ అల‌రిస్తుంది. ఈ పాట‌ను రాసింది.. స‌ముద్రాల సీనియ‌ర్‌. దీనికి సంగీతం అందించింది ఘంట‌సాల‌. అయితే.. ఈ పాట ఏమీ ఒక రాత్రిలో అయిపోలేదు. రాసేందుకు మూడు నెల‌లు ప‌ట్టింది. ఏ పాట తీసుకువెళ్లినా.. అన్న‌గారికి న‌చ్చేదికాదు.

ఆయ‌న ఒక్క‌టే చెప్పేవారు. మీరు ఏం చేస్తారో తెలియ‌దు. త‌ర‌త‌రాల పాటు ఈ పాట నిలిచిపోవాలి అని స‌ముద్రాల‌కు సూచించారు. స‌ముద్రాల ప్రాణం పెట్టి రాసిన పాట ఇది. ఇప్ప‌టికీ.. ఈ పాట అజ‌రామ‌రంగా నిలిచిపోయింది. అంతేకాదు.. ఈ పాట చిత్రీక‌ర‌ణ కూడా అన్న‌గారు అంతే శ్ర‌ద్ధ‌గా చేశారు. ప్ర‌తి ఫ్రేమ్‌లోనూ అల‌నాడు సీతారాముల క‌ళ్యాణం ఇలానే జ‌రిగిందా? అన్న‌ట్టుగా చూపించారు. ద‌టీజ్ ఎన్టీఆర్ అని ఈ పాట చూసిన వారు అన‌కుండా ఉండ‌లేరు. ఒక‌సారి చూసేయండి.. యూట్యూబ్‌లో సిద్ధంగా ఉంది. అప్పుడు మీరు కూడా నోరు వెళ్ల‌బెట్టి అన్న‌గారిని స్మ‌రించ‌కుండా ఉండ‌లేరు.

మ‌రిన్ని వార్త‌ల కోసం తెలుగు లైవ్స్‌ వాట్సాప్ లో ఫాలో అవ్వండి

Latest news