ఇండియాలో నెంబర్.1 దర్శకుడు ఎవరు అంటే మొదట వినిపించే పేరు రాజమౌళి. రెండున్నర దశాబ్దాల నుంచి దర్శకుడిగా సత్తా చాటుతున్న రాజమౌళి.. ఇప్పటివరకు అపజయం అన్నదే ఎరగలేదు. కెరీర్ ఆరంభం నుండి ఒక సినిమాను నుంచి మరొక సినిమాను తీస్తూ బాక్సాఫీస్ ను షేక్ చేస్తున్నారు. తన ప్రతి సినిమాతోనే ఎన్నో అరుదైన రికార్డులను సెట్ చేస్తున్నారు. అటువంటి రాజమౌళి దర్శకత్వంలో నటించాలని అగ్రతారలు కూడా ఆరాటపడుతుంటారు.
కానీ గతంలో కొందరు నటీనటులు తెలుసో తెలియకో రాజమౌళితో కలిసి వర్క్ చేసే ఛాన్స్ వస్తే రిజెక్ట్ చేశారు. ఈ జాబితాలో కోలీవుడ్ స్టార్ హీరో సూర్య కూడా ఒకరు. రాజమౌళి తెరకెక్కించిన ఓ బ్లాక్ బస్టర్ మూవీలో సెకండ్ హీరో ఛాన్స్ వస్తే సూర్య చెయ్యను పొమ్మన్నాడట. ఇంతకీ ఆ సినిమా మరేదో కాదు సై. 2004 లో రాజమౌళి దర్శకత్వంలో విడుదలైన ఒక విజయవంతమైన సినిమా ఇది.
ఈ చిత్రంలో నితిన్, జెనీలియా జంటగా నటిస్తే.. శశాంక్ సెకండ్ హీరోగా చేశాడు. రాజీవ్ కనకాల, ప్రదీప్ రావత్, నాజర్, తనికెళ్ళ భరణి, అజయ్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోసించారు. శ్రీ భారత్ ఎంటర్ ప్రైజెస్ బ్యానర్ పై ఎ. భారతి నిర్మించిన ఈ చిత్రానికి కీరవాణి స్వరాలు అందించాడు. స్పోర్ట్స్ బ్యాక్‌డ్రాప్ లో యాక్షన్ ఎంటర్టైనర్ గా రూపుదిద్దుకున్న సై చిత్రం అప్పట్లో సూపర్ డూపర్ హిట్ గా నిలిచింది. ముఖ్యంగా యూత్ ను ఈ చిత్రం ఎంతగానో ఆకట్టుకుంది.
అయితే సై మూవీలో శశాంక్ పోషించిన సెకండ్ హీరో పాత్రకు డైరెక్టర్ రాజమౌళి మొదట సూర్యను తీసుకోవాలని భావించారట. తమిళ ఇండస్ట్రీలో సూర్య అప్పుడప్పుడే హీరోగా ఎదుగుతున్నాడు. ఆ టైమ్ లో సై మూవీలో చేసే అవకాశం సూర్యకు వచ్చింది. కానీ సెకండ్ హీరో పాత్ర నచ్చకపోవడంతో సూర్య చెయ్యనని చెప్పాడట. అప్పుడు రాజమౌళి శశాంక్‌ను తీసుకున్నారు. కట్ చేస్తే సినిమా సూపర్ హిట్ అయింది. హీరో నితిన్ తో పాటు శశాంక్ కు మంచి గుర్తింపు వచ్చింది. దాంతో సూర్య సై మూవీని మిస్ చేసుకున్నందుకు ఎంతగానో ఫీల్ అయ్యాడని ఓ న్యూస్ గతంలో నెట్టింట చక్కర్లు కొట్టింది.