ఉస్తాద్ రామ్ పోతినేనికి టాలీవుడ్ లోనే కాదు బాలీవుడ్ లో సైతం మంచి క్రేజ్ ఉంది. రామ్ ఇంతవరకు హిందీలో నేరుగా ఒక్క తెలుగు సినిమా కూడా చేయలేదు. కానీ రామ్ నటించిన పలు తెలుగు సినిమాలు హిందీలో డబ్ అయ్యి యూట్యూబ్ ద్వారా అందుబాటులోకి రాగా.. నార్త్ సినీ ప్రియుల నుంచి ఆయా చిత్రాలకు అదిరిపోయే రెస్పాన్స్ లభిస్తోంది.
ఇతర టాలీవుడ్ హీరోల సినిమాలతో కంపేర్ చేస్తే రామ్ సినిమాలు ఎవరో అందుకోలేనంత భారీగా వ్యూవర్ షిప్ ను సొంతం చేసుకుంటూ దూసుకుపోతున్నాయి. ఇప్పటి వరకు రామ్ కెరిర్ లో ఒకటి కాదు రెండు కాదు ఏకంగా 9 సినిమాలు హిందీ వెర్షన్ లో 100 మిలియన్ వ్యూస్ మార్క్‌ను అవలీలగా అందుకున్నాయి.
ఈ జాబితాలో ఇస్మార్ట్ శంకర్, స్కంద, హలో గురు ప్రేమ కోసమే, వున్నది ఒకటే జిందగీ, పండగ చేస్కో, గణేష్, హైపర్, నేను శైలజా వంటి సినిమాలు ఉన్నాయి. హిందీలో ఇవి 100 మిలియన్ వ్యూస్ ని దాటేశాయి. కొన్ని సినిమాలైతే మూడు వందలు, నాలుగు వందలు, ఐదు వందల మిలియన్ మార్క్ ని కూడా అందుకుని సంచలనం రేపుతున్నాయి.
హిందీ వెర్షన్ లో 100 మిలియన్ వ్యూస్ సాధించిన చిత్రాలు టాలీవుడ్ లో ఒక్క రామ్ ఖాతాలోనే అత్యధికంగా ఉన్నాయి. ఈ విషయంలో మిగతా హీరోలు రామ్ దరిదాపుల్లో కూడా లేరు. ఒకరకంగా ఇదీ కూడా ఒక రికార్డ్ అనే చెప్పుకోవచ్చు. కాగా, రామ్ ప్రస్తుతం డబుల్ ఇస్మార్ట్ మూవీతో బిజీగా ఉన్నాడు. ఇస్మార్ట్ శంకర్ కు ఇది సీక్వెల్ కాగా.. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహించాడు. ఆగస్టు 15న డబుల్ ఇస్మార్ట్ సినిమా పాన్ ఇండియా స్థాయిలో విడుదల అయ్యేందుకు ముస్తాబవుతోంది.