ప్రముఖ జ్యోతిష్యుడు వేణు స్వామి గురించి కొత్తగా పరిచయాలు అవసరం లేదు. సినీ రాజకీయ ప్రముఖుల జాతకాలు చెబుతూ తెలుగు రాష్ట్రాల్లో వేణు స్వామి గత మూడేళ్లలో విపరీతమైన పాపులారిటీ సంపాదించుకున్నారు. అలాగే హీరో, హీరోయిన్ల చేత పూజలు పునస్కారాలు చేయిస్తూ పలు మార్లు వార్తలు నిలవడంతో వేణు స్వామికి మరింత క్రేజ్ ఏర్పడింది. అయితే ఇటీవల ఏపీ ఎగ్జిట్ పోల్స్ పై వేణు స్వామి చెప్పిన ప్రిడిక్షన్ తప్పింది. దాంతో ఎన్నో విమర్శలు వచ్చాయి.
కొందరు వేణు స్వామిని సోషల్ మీడియా ద్వారా ఓ రేంజ్ లో ఏకేశారు. అప్పటి నుంచి కాస్త సైలెంట్ గా ఉన్న వేణు స్వామి.. తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చారు. ఈ సందర్భంగా ట్రోలర్స్ కు తనదైన శైలిలో కౌంటర్ ఇచ్చారు. గతంలో తాను చెప్పిన విషయాలు 90 శాతం నిజమయ్యాయి.. వాటి గురించి వదిలేసి ఫెయిల్ అయిన పది శాతం గురించి మాట్లాడుతున్నారు, పనీ పాటా లేని వారే తన పైన విమర్శలు చేస్తున్నారంటూ వేణు స్వామి ఫైర్ అయ్యారు.
ఇక ఇదే ఇంటర్వ్యూలో ప్రముఖ స్టార్ హీరోయిన్ రకుల్ ప్రీత్ సింగ్ వైవాహిక జీవితం పై వేణు స్వామి బిగ్ బాంబ్ పేల్చారు. మరో ఆరు నెలల్లో రకుల్ ప్రీత్ సింగ్ తన భర్త జాకీ భగ్నానీ నుంచి విడాకులు తీసుకుంటుందని వేణు స్వామి కొండ బద్దలు కొట్టారు. రకుల్ ప్రీత్ సింగ్ కు వివాహం తర్వాత అంతగా కలిసిరాదు, చాలా సమస్యలు ఎదుర్కొంటుందని తానే ముందే చెప్పానని.. తాను చెప్పినట్టుగానే ఆమె వైవాహిక జీవితం సాగుతుందని, ఆరు నెలల్లో ఆమె విడాకులు తీసుకుంటుందని వేణు స్వామి వెల్లడించారు.
దీంతో ఆయన వ్యాఖ్యలు ఇప్పుడు సోషల్ మీడియాలో సంచలనంగా మారాయి. రకుల్ ఫ్యాన్స్ వేణు స్వామి కామెంట్స్ పై తీవ్ర అగ్రహం వ్యక్తం చేసుకున్నారు. కాగా, 2024 ఫిబ్రవరిలో బాలీవుడ్ నిర్మాత జాకీ భగ్నానీని రకుల్ ప్రేమ వివాహం చేసుకుంది. గోవాలో వీరి పెళ్లి అత్యంత వైభవంగా జరిగింది. అయితే పెళ్లి జరిగిన కొద్ది రోజులకే జాకీ అప్పుల్లో కూరుకుపోయాడు. అతని హోమ్ బ్యానర్ పూజా ఎంటర్‌టైన్‌మెంట్స్ పై నిర్మితమైన చిత్రాలు ఘోర పరాజయాన్ని మూటగట్టుకోవడంతో అతనికి దాదాపు రూ.500 కోట్లకు పైగా నష్టం ఏర్పడింది. అప్పుల వల్ల ఆస్తులను కూడా అమ్మకానికి పెట్టాడు. ఇక మరోవైపు రకుల్ సోదరుడు అమన్ ప్రీత్ సింగ్ రీసెంట్ గా డ్రగ్స్ కేసులో అరెస్ట్ అయిన సంగతి తెలిసిందే.