పాన్ ఇండియా సెన్సేషన్ ప్రభాస్ ఎంత గొప్ప నటుడో అంతే గొప్ప మనసు ఉన్న వ్యక్తి. ఈ విషయం ఇప్పటికే ఎన్నోసార్లు నిరూపితం అయ్యింది. సినిమాలకు కోట్లలో రెమ్యునరేషన్ తీసుకోవడమే కాదు.. ఎదుట వారికి సాయం చేయడంలోనూ ప్రభాస్ ముందే ఉంటాడు. ప్రభాస్ గొప్ప మనసుకు నిదర్శనంగా మరో ఉదాహరణ తాజాగా తెరపైకి వచ్చింది.
ఇటీవల ప్రభాస్ కల్కి 2898 ఏడీ మూవీ తో ప్రేక్షకులను పలకరించిన సంగతి తెలిసిందే. ఈ మైథాలజీ అండ్ సైన్స్ ఫిక్షన్ యాక్షన్ ఫిల్మ్ ను నాగ్ అశ్విన్ డైరెక్ట్ చేయగా.. అశ్వినీ దత్ నిర్మాతగా వ్యవహరించారు. భారీ అంచనాల నడుమ పాన్ ఇండియా స్థాయిలో విడుదలైన కల్కి చిత్రం పాజిటివ్ టాక్ తో బాక్సాఫీస్ వద్ద వసూళ్ల వర్షం కురిపిస్తుంది. రూ. 1000 కోట్లు కొల్లగొట్టే దిశగా పరుగులు పెడుతోంది.
ఇదిలా ఉంటే.. కల్కి మూవీ కోసం పని చేసిన మురళి అనే కాస్ట్యూమ్ డిజైనర్ తాజాగా ఓ యూట్యూబ్ ఛానల్ కు ఇంటర్వ్యూ ఇచ్చాడు. ఈ సందర్భంగా అతను ప్రభాస్ గురించి ఓ ఆసక్తికర విషయాన్ని బయట పెట్టాడు. కల్కి సినిమా కోసం అన్ని డిపార్ట్మెంట్స్ లో పని చేసిన ప్రతి ఒక్కరికి ప్రభాస్ రూ. 10 వేలు చొప్పున గిఫ్ట్ గా ఇచ్చాడట. కల్కి మూవీ కోసం వేలాది మంది పని చేయగా.. వారందరికీ మన డార్లింగ్ కోట్ల రూపాయిలు పంచాడట.
అందరి డీటెయిల్స్ తీసుకుని ప్రతి ఒక్కరి అకౌంటర్ లోకి రూ.10 వేలు చొప్పున జమ చేయించాడట. ఈ విషయాన్ని తాజాగా మురళి బయటపెట్టాడు. తన కెరీర్ లో ఇంతవరకు ప్రభాస్ లాంటి హీరోను చూడలేదని.. కల్కి షూటింగ్ జరిగిననన్ని రోజులు ఆయన ఇంటి వద్ద నుంచే అందరికీ భోజనం వచ్చేదని కూడా మురళి చెప్పుకొచ్చాడు. దీంతో ప్రభాస్ విశాల హృదయానికి అభిమానులు మరియు నెటిజన్లు హ్యాట్సాఫ్ చెబుతున్నారు. ప్రభాస్ రియల్ హీరో అంటూ కామెంట్లు చేస్తున్నారు.