పవర్ స్టార్ పవన్ కళ్యాణ్ కెరీర్ లో ఆల్ టైమ్ క్లాసిక్ గా నిలిచిన చిత్రం తొలి ప్రేమ. ఎ. కరుణాకరన్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో కీర్తి రెడ్డి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. వాసుకి, అచ్యుత్, ఆలీ, వేణుమాధవ్, నగేష్, సంగీత తదితరులు కీలక పాత్రలను పోషించగా.. దేవా సంగీతం అందించారు. ఎస్.ఎస్.సి ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన ఈ రొమాంటిక్ డ్రామా విడుదలై నిన్నటికి 26 ఏళ్లు.
1998 జులై 24న ప్రేక్షకుల ముందుకు తొలి ప్రేమ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ సొంతం చేసుకుంది. అటు యూత్ ను, ఇటు ఫ్యామిలీ ఆడియెన్స్ ను ఈ మూవీ ఎంతగానో ఆకట్టుకుంది. ముఖ్యంగా సాంగ్స్ సినిమా మొత్తానికి హైలెట్‌గా నిలిచాయి. గోకులంలో సీత, సుస్వాగం వంటి హిట్ మూవీస్ అనంతరం పవన్ కళ్యాణ్ తొలిప్రేమతో బ్లాక్ బస్టర్ ను ఖాతాలో వేసుకున్నారు.
21 కేంద్రాలలో 100 రోజులకు పైగా ఆడిన తొలి ప్రేమ చిత్రం.. 2 సెంటర్లలో 200 రోజులకు పైగా నడిచింది. అలాగే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ గా జాతీయ అవార్డును సొంతం చేసుకోవడంతో పాటు పలు విభాగాల్లో ఆరు నంది పురస్కారాలను కైవశం చేసుకుంది. 30వ ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియాలో ఇండియన్ పనోరమా ప్రధాన స్రవంతి విభాగంలో తొలి ప్రేమ చిత్రం ప్రదర్శించబడటం మరొక విశేషం.
కలెక్షన్స్ విషయానికి వస్తే.. రూ.4.27 కోట్ల బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బరిలోకి దిగిన తొలి ప్రేమ చిత్రం ఫుల్ రన్ లో రూ.8.6 కోట్ల షేర్ ను రాబట్టింది. బయ్యర్లకు డబుల్ ప్రాఫిట్స్ ను అందించింది. ఇక తొలి ప్రేమ చిత్రం తమిళంలోకి ఆనంద మజైగా డబ్ చేయబడింది. కన్నడలో ప్రీత్సు తప్పెనిల్లా (2000) గా మరియు హిందీలో ముజే కుచ్ కెహనా హై (2001) గా రీమేక్ చేశారు. ఆయా భాషల్లో సైతం తొలి ప్రేమ ఓ మోస్తరు విజయాన్ని నమోదు చేసింది.