తెలుగు చలన చిత్ర పరిశ్రమలో గత రెండేళ్ల నుంచి రీరిలీజ్ ట్రెండ్ ఎంత జోరుగా నడుస్తుందో ప్రత్యేకంగా వివరించి చెప్పక్కర్లేదు. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన పోకిరి మూవీతో ఈ రీరిలీజ్ ట్రెండ్ అనేది మొదలైంది. ఆ తర్వాత ఎన్నో ఓల్డ్ మూవీతో థియేటర్స్ కు క్యూ కట్టాయి. అయితే ఇప్పుడు ఈ జాబితాలో మహేష్ బాబు నటించిన మరో బ్లాక్ బస్టర్ ఫిల్మ్ చేరబోతోంది. ఆగస్టు 9న మహేష్ బాబు బర్త్‌డే.
ఈ నేపథ్యంలోనే ఆయన హీరోగా యాక్ట్ చేసిన మురారి సినిమాను ఆగస్టు 9న భారీ ఎత్తున రీరిలీజ్ చేయాలని ప్లాన్ చేస్తున్నారట. కృష్ణవంశీ దర్శకత్వంలో తెరకెక్కిన ఫ్యామిలీ అండ్ లవ్ ఎంటర్టైనర్ ఇది. ఈ చిత్రంలో మహేష్ బాబుకు జోడిగా సోనాలి బింద్రే నటించింది. సోనాలీ బింద్రేకి తెలుగులో ఇదే మొదటి సినిమా కాగా.. లక్ష్మి, ప్రసాద్ బాబు, సుకుమారి, కైకాల సత్యనారాయణ, గొల్లపూడి మారుతీరావు, రవిబాబు తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
రామ్ ప్రసాద్ ఆర్ట్స్ బ్యానర్ పై నిర్మితమైన మురారి సినిమాకు మణిశర్మ సంగీతం అందించారు. 2001 ఫిబ్రవరి 17న విడుదలైన మురారి మూవీ మొదట ఆట నుంచే పాజిటివ్ టాక్ ను సొంతం చేసుకుంది. మహేష్ బాబు కెరీర్ లో ఫస్ట్ బ్లాక్ బస్టర్ హిట్ మూవీగా నిలిచింది. మురారి చిత్రంతో మహేష్ బాబు ఫ్యామిలీ ఆడియన్స్ కు ఎంతగానో దగ్గరయ్యాడు. అలాగే ఈ సినిమాలో పాటలు ఇప్పటికీ ఎవర్ గ్రీన్ అనే చెప్పవచ్చు.
అయితే మూడు నంది అవార్డులను అందుకున్న మురారి చిత్రం దాదాపు 23 ఏళ్ల తర్వాత మళ్లీ థియేటర్స్ లో సందడి చేయబోతోంది. మహేష్ బర్త్‌డే సందర్భంగా ఆగస్ట్ 9న ఈ మూవీ స్పెషల్ షోస్‌ను తెలుగు రాష్ట్రాలతో పాటు ఓవర్సీస్‌లో స్క్రీనింగ్ చేయబోతున్నారు. అది కూడా అలా ఇలా కాదు.. దాదాపు మూడు వందలకుపైగా థియేటర్స్ లో మురారి రీ రిలీజ్ కాబోతోందని సమాచారం అందుతోంది. ఇదే నిజమైతే రీరిలీజ్‌లో మురారి ఎలాంటి రెస్పాన్స్ ను అందుకుంటుందో చూడాలి.