అక్కినేని నాగేశ్వరరావు స్టయిల్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. ఆయన కూడా తెలుగుకు తెలుగు సంస్కృతికి ప్రాధాన్యం ఇస్తారు. డబుల్ మీనింగ్ డైలాగులు.. పాటలు అంటే.. ఆయనకు చిరాకు. అసలు వినేందుకు కూడా ఇష్టపడరు. అలాంటి అక్కినేని ఒక సందర్భంలో ఏకంగా డబుల్ మీనింగ్ పాటలో డ్యాన్స్ చేయాల్సి వచ్చింది. పైగా.. నిర్మాత సొంత వియ్యంకుడు దగ్గుబాటి రామానాయుడు, దర్శకుడు అగ్ర డైరెక్టర్ కె. ప్రకాశరావు(రాఘవేంద్రరావు తండ్రి). పాట రాసింది ఆత్రేయ. సంగీతం.. శంకరాభరణం వంటి సినిమాను అందించిన మహదేవన్.
మరి ఈ పాట.. చూస్తే.. అత్యంత దారుణం. లేలేలే.. నారాజా.. లేవనంటావా.. నన్ను లేపమంటావా?
అనే లిరిక్స్‌తో ప్రారంభమ వుతుంది. ప్రేమనగర్ సినిమాలో ఈ పాటను పెట్టారు. ఈ సినిమాలో వాణిశ్రీ హీరోయిన్. రామానాయుడు ఎన్నో అప్పులు చేసి మరీ నిర్మించిన సినిమా. ఈ సినిమా ఫట్ అయితే.. ఇక రామానాయుడు వెళ్లి వ్యవసాయం చేసుకునేందుకు కూడా రెడీ అయ్యారు. ఇలాంటి సినిమాలో అక్కినేని ఈ పాటలో నటించారు. పైగా.. పక్కన వ్యాంపు పాత్రల నటీమణి జ్యోతి లక్ష్మి. దీంతో అక్కినేని మొదట కుదరదని చెప్పేశారు. దీంతో రామానాయుడు గుండెల్లో గుబులు. దర్శకుడు కూడా ఏమీ చెప్పలేని పరిస్థితి.
దీంతో ఈ పాట కోసం పెట్టుకున్న రెండురోజులు అక్కినేని రాలేదు. ఈ పాట లేకుండా చేస్తేనే సినిమాలో నటిస్తానని చెప్పారు. ఏం చేయాలో తెలియలేదు రామానాయుడు, ప్రకాశరావులకు. దీంతో వారిద్దరూ కలిసి ఓ రోజు ఉదయాన్నే అక్కినేని ఇంటికి వెళ్లి నచ్చ జెప్పారు. హీరో పాత్రను మరోసారి వివరించారు. సందర్భాన్ని కూడా విడమరిచి చెప్పారు. ఇది తప్ప గత్యంతరం లేదని వివరించారు. దీంతో చిట్టచివరకు.. రెండు రోజుల పాటుజరిగిన చర్చలు ఫలించి.. ఎట్టకేలకు అక్కినేని ఒప్పుకొన్నారు.
ఇదే విషయాన్ని ఓ సందర్భంలో అక్కినేని చెబుతూ..“నాకు ఇష్టం లేదు కానీ డైరెక్టర్‌గారు కల్యాణ్ కేరెక్టర్ గురించి చెప్పి, ఆ పాట ఉంటే బాగుంటుందన్నారు. తీసిన తర్వాత బాగాలేకపోతే క్యాన్సిల్ చేద్దామన్నారు. దర్శకుడు చెప్పింది వినాలి కనుక కాదనలేకపోయాను’ అని చెప్పారు. ఈ సినిమా పాటలన్నీ సూపర్ హిట్టనే విషయం అందరికీ తెలిసిందే. ఈ పాట మరీ ఎక్కువగా పాపులర్ కావడం విశేషం.