మెగా పవర్ స్టార్ రామ్ చరణ్, దర్శకధీరుడు రాజమౌళి కాంబినేషన్ లో వచ్చిన తొలి చిత్రం మగధీర విడుదలై నేటి 15 ఏళ్లు. ఈ రొమాంటిక్ ఫాంటసీ యాక్షన్ చిత్రాన్ని గీతా ఆర్ట్స్ బ్యానర్ పై అల్లు అరవింద్ అప్పట్లోనే ఏకంగా రూ. 44 కోట్ల బడ్జెట్ తో నిర్మించారు. కాజల్ అగర్వాల్ హీరోయిన్ గా నటించగా.. శ్రీహరి, దేవ్ గిల్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. ఎం.ఎం. కీరవాణి స్వరాలు అందించారు.
భారీ అంచనాల నడుమ 2009 జూలై 30న విడుదలైన మగధీర చిత్రం సంచలన విజయాన్ని నమోదు చేసింది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద విధ్వంసాన్ని సృష్టించింది. కథ, రాజమౌళి దర్శకత్వం, విజువల్ ఎఫెక్ట్స్, రామ్ చరణ్-కాజల్ అగర్వాల్ యాక్టింగ్, కీరవాణి సంగీతం సినిమాకు హైలెట్ గా నిలిచాయి. మొదటి రోజే రూ. 15 కోట్ల షేర్ ని రాబట్టిన మగధీర.. ఫుల్ రన్ లో రూ. 60 కోట్ల షేర్, రూ. 128 కోట్ల గ్రాస్ వసూళ్లు కొల్లగొట్టి అల్ టైం ఇండస్ట్రీ హిట్ గా నిలిచింది. 100 కోట్ల క్లబ్‌లో చేరిన తొలి తెలుగు సినిమాగా రికార్డు సెట్ చేసింది.
అలాగే ఈ సినిమా 223 సెంటర్లలో 100 రోజుల రన్ పూర్తి చేసుకుంది. మూడు కేంద్రాలలో 175 రోజులు, ఒక థియేటర్ లో 365 రోజుల రన్‌ను పూర్తి చేసుకుంది. కర్నూలులోని విజయలక్ష్మి థియేటర్‌లో 1000 రోజులు ప్రదర్శితమై మగధీర మరో అరుదైన రికార్డును నెలకొల్పింది. మగధీర విజయం కాజల్‌ను తెలుగు సినిమాల్లో అత్యంత డిమాండ్ ఉన్న హీరోయిన్ గా మార్చింది.
మగధీర మూవీతో రామ్ చరణ్ స్టార్ హీరోగా నిలదొక్కుకున్నాడు. శ్రీహరి పోషించిన షేర్ ఖాన్ పాత్ర అతని కెరీర్‌లో అత్యుత్తమ పాత్రలలో ఒకటిగా పరిగణించబడింది. అలాగే మగధీర తో రాజమౌళి టాలీవుడ్ లో నెం. 1 దర్శకుడిగా మారిపోయాడు. ఇకపోతే 57వ జాతీయ చలనచిత్ర అవార్డులలో ఉత్తమ కొరియోగ్రఫీ మరియు ఉత్తమ స్పెషల్ ఎఫెక్ట్స్ విభాగంలో మగధీర రెండు జాతీయ అవార్డులను గెలుచుకుంది. ఆరు ఫిల్మ్‌ఫేర్ అవార్డులు మరియు తొమ్మిది రాష్ట్రాల నంది అవార్డులను సైతం సొంతం చేసుకుంది.