స్టూడెంట్ నెం.1, సింహాద్రి వంటి హిట్ మూవీస్ అనంతరం దర్శకధీరుడు రాజమౌళి, యంగ్ టైగర్ ఎన్టీఆర్ కాంబినేషన్ లో వచ్చిన హ్యాట్రిక్ చిత్రం యమదొంగ. ఇదొక ఫాంటసీ యాక్షన్ కామెడీ మూవీ. విశ్వామిత్ర క్రియేషన్స్ పతాకంపై చిరంజీవి, గంగరాజు గుణ్ణం కలిసి నిర్మించిన ఈ చిత్రంలో ప్రియమణి హీరోయిన్ గా యాక్ట్ చేసింది. మోహన్ బాబు, మమతా మోహన్ దాస్, జయ ప్రకాష్ రెడ్డి, అలీ, ఎమ్.ఎస్ నారాయణ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు.
2007 ఆగస్టు 15న విడుదలైన యమదొంగ చిత్రం తొలి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. అన్ని వర్గాల ప్రేక్షకులను ఆకట్టుకుని బాక్సాఫీస్ వద్ద కాసుల వర్షం కురిపించింది. రూ. 18 కోట్లతో నిర్మితమైన యమదొంగ.. అప్పట్లోనే దాదాపు రూ. 30 కోట్ల వసూళ్లను కొల్లగొట్టింది. 2007 సంవత్సరంలో అత్యధిక వసూళ్లు సాధించిన తెలుగు చిత్రంగా యమదొంగ రికార్డు సెట్ చేసింది. అలాగే సినిమా నాలుగు నంది అవార్డులను గెలుచుకుంది. మరోవైపు జూనియర్ ఎన్టీఆర్ ఉత్తమ నటుడిగా ఫిల్మ్‌ఫేర్ అవార్డును గెలుచుకున్నాడు.
ఇకపోతే ఈ చిత్రంలో కథానాయికగా ప్రియమణి నటించిన సంగతి తెలిసిందే. తన సహజ నటనతో మహి పాత్రకు ప్రియమణి వంద శాతం న్యాయం చేసింది. కానీ యమదొంగలో మొదట అనుకున్న హీరోయిన్ మాత్రం ప్రియమణి కాదట. రాజమౌళి ఫస్ట్ ఛాయిస్ కాజల్ అగర్వాల్. అవును, లక్ష్మీ కళ్యాణంలో కాజల్ అభినయానికి ఫిదా అయిన రాజమౌళి.. యమదొంగ సినిమాలో ఆమెను హీరోయిన్ గా పెట్టుకోవాలని భావించారు.
కానీ అప్పటికే కాజల్ చేతి నిండా సినిమాలతో క్షణం తీరిక లేకుండా గడుపుతోంది. కాజల్ డేట్స్ దొరక్కపోవడంతో రాజమౌళి ప్రియమణి వైపు మొగ్గు చూపారు. అలా కాజల్ చేయాల్సిన యమదొంగ చిత్రం ప్రియమణి ఖాతాలో పడింది. అయితే కాజల్ అగర్వాల్ కు ఆ తర్వాత రాజమౌళి మగధీర మూవీలో ఛాన్స్ ఇచ్చారు. ఈ చిత్రం ఇండస్ట్రీ హిట్ గా నిలివడమే కాకుండా కాజల్ కు భారీ స్టార్డమ్ ను అందించింది.