అఖండ మూవీతో లాంగ్ గ్యాప్ అనంతరం బిగ్ హిట్ కొట్టి సక్సెస్ ట్రాక్ ఎక్కిన నటసింహం నందమూరి బాలకృష్ణ ప్రస్తుతం కెరీర్ పరంగా ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న సంగతి తెలిసిందే. బ్యాక్ టు బ్యాక్ విజయాలను ఖాతాలో వేసుకుంటూ నేటితరం హీరోలకు ఆయన గట్టి పోటీని ఇస్తున్నారు. ఇప్పుడు బాబీ కొల్లి డైరెక్షన్ లో బాలయ్య తన 109వ చిత్రాన్ని చేస్తున్నారు. గత ఏడాదే ఈ సినిమా సెట్స్ మీదకు వెళ్ళింది. వీర మాస్ అనే టైటిల్ పరిశీలనలో ఉంది.
అలాగే మరోవైపు బోయపాటి శ్రీను దర్శకత్వంలో అఖండ 2 మూవీని బాలయ్య లైన్ లో పెట్టారు. 2021 లో విడుదలైన అఖండ చిత్రం బాలయ్య కెరీర్ లో మైల్ స్టోన్ మూవీగా నిలిచింది. ఈ సినిమా అందుకున్న విజయం, బాక్సాఫీస్ వద్ద కొల్లగొట్టిన వసూళ్ల గురించి ప్రత్యేకంగా చెప్పక్కర్లేదు. 2014లో వచ్చిన లెజెండ్ తర్వాత బాలయ్యకు మళ్లీ ఆ స్థాయి హిట్ అఖండతోనే దక్కింది. ఇక ఇదే తరుణంలో ఈ మూవీకి సీక్వెల్ గా అఖండ 2 ను తెరకెక్కించాలని బోయపాటి భావించడం.. అందుకు బాలయ్య గ్రీన్ సిగ్నల్ ఇవ్వడం.. ప్రీ ప్రొడక్షన్ పనులు ప్రారంభం కావడం జరిగిపోయాయి.
త్వరలోనే రెగ్యులర్ షూటింగ్ కూడా స్టార్ట్ కాబోతోంది. అయితే తాజాగా అఖండ 2కు సంబంధించి ఓ ఇంట్రెస్టింగ్ న్యూస్ తెరపైకి వచ్చింది. ఈ సినిమా విషయంలో బాలకృష్ణ ఒక స్ట్రిక్ట్ ఆర్డర్‌ను జారీ చేశారట. ఇంతకీ విషయం ఏంటంటే.. ప్రస్తుతం బోయపాటి శ్రీను కాస్టింగ్ ఎంపికలో ఉన్నారు. అఖండ చిత్రంలో హీరోయిన్ గా ప్రగ్యా జైస్వాల్ యాక్ట్ చేసింది. కానీ సీక్వెల్ లో మాత్రం ఆమెకు బదులుగా మరొక హీరోయిన్ ను తీసుకోవాలని బోయపాటి భావించారట.
అయితే అందుకు బాలయ్య ఏమాత్రం ఒప్పుకోలేదు. అఖండ 2లో నాకు హీరోయిన్ గా ప్రగ్యానే కావాలని.. ఆమెను ఎంపిక చేయాలని బాలయ్య చెప్పారట. బోయపాటి నచ్చజెప్పే ప్రయత్నం చేసినా బాలయ్య వినలేదట. దాంతో ప్రగ్యానే హీరోయిన్ గా ఎంపిక చేసినట్లు టాలీవుడ్ ఫిల్మ్ సర్కిల్స్ లో ఒక న్యూస్ ట్రెండ్ అవుతోంది. ఇక ప్రగ్యా విషయంలో బాలయ్య అంత పట్టు పడటం వెనక కారణం సెంటిమెంట్. అఖండలో ప్రగ్యాతో యాక్ట్ చేసిన బాలయ్య బిగ్ హిట్ కొట్టారు. ఇప్పుడు సీక్వెల్ లోనూ ఆమెనే హీరోయిన్ గా తీసుకుంటే హిట్ సెంటిమెంట్ రిపీట్ అవుతుందని ఆయన భావిస్తున్నారట.