తమిళ స్టార్ హీరోల్లో సూర్య ఒకరు. సినీ నేపథ్యం ఉన్న కుటుంబంలో జన్మించినప్పటికీ చిన్నతనంలో ఎప్పుడు ఆయన షూటింగ్స్ కు వెళ్ళింది లేదు. నటనపై ఎటువంటి ఆసక్తి పెంచుకోలేదు. ఇష్టం లేకుండానే ఇండస్ట్రీ లోకి వచ్చిన సూర్య.. సినిమా రంగంలో తనదైన ముద్రవేశారు. ఎన్ని విమర్శలు ఎదురైనా వాటికి ఎదురెళ్లి హీరోగా నిలదొక్కుకున్నారు. తన సహజ నటనతో స్టార్ ఇమేజ్ ను సంపాదించుకున్న సూర్య పుట్టినరోజు నేడు. ఈ సందర్భంగా సూర్య గురించి కొన్ని ఇంట్రెస్టింగ్ విషయాలను ఇప్పుడు తెలుసుకుందాం.
సూర్య అసలు పేరు శరవణన్ శివకుమార్. తమిళనాడులోని చెన్నైలో 1975 జూలై 23న తమిళ సినీ నటుడు శివకుమార్, లక్ష్మి దంపతులకు సూర్య జన్మించారు. అతని తమ్ముడు కార్తీ కూడా నటుడే కాగా.. సొందరి బృందా గాయనిగా, వాయిస్ ఆర్టిస్ట్ గా సత్తా చాటుతున్నారు. చెన్నైలోని లయోలా కాలేజీ నుండి తన అండర్ గ్రాడ్యుయేట్ డిగ్రీ బి.కామ్ పొందాడు.
తండ్రి శివకుమార్ నటుడే అయినప్పటికీ సూర్య మాత్రం ఇండస్ట్రీలోకి రావాలని అస్సలు అనుకోలేదు. అందులో భాగంగానే.. సినిమాల్లోకి రాకముందు ఎనిమిది నెలల పాటు గార్మెంట్ ఎక్స్‌పోర్ట్స్ ఫ్యాక్టరీలో సూర్య జాబ్ చేశాడు. రోజుకు 18 గంటలు పని.. నెలకు రూ. 700 జీతం. అయితే ఆ సేలరీ సరిపోకపోవడంతో సూర్య అప్పు చేసి మరీ చిన్న బిజినెస్ స్టార్ట్ చేశాడు. వ్యాపారం లాభసాటిగా ఉన్నా కూడా ఆ రంగంపై సూర్య ఆసక్తి చూపలేకపోయాడు.
దాంతో వ్యాపారం దెబ్బతిని అప్పుల్లోకి వెళ్లాడు. అటువంటి సమయంలో అప్పులు తీర్చేందుకు నటుడు కావాలని సూర్య నిర్ణయించుకుని ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. మణిరత్నం నిర్మించిన నెర్రుక్కు నెర్ మూవీతో 22 సంవత్సరాల వయస్సులో తన నటనా వృత్తిని ప్రారంభించాడు. ఈ మూవీ సమయంలోనే శరవణన్ గా ఉన్న పేరును మణిరత్నం గారు సూర్యగా మార్చారు. ఇక నటనే ఇష్టంలేని సూర్య ఆ విధంగా సిపీ పరిశ్రమలోకి వచ్చి స్టార్‌గా ఎదిగాడు. యువ నటులకు ఆదర్శింగా నిలిచాడు.