‘ భారతీయుడు 2 ‘ సినిమా పై రిలీజ్ ముందు మామూలు అంచనాలు లేవు. 28 ఏళ్ల తర్వాత భారతీయుడు లాంటి సూపర్ హిట్ సినిమాకు సీక్వెల్ గా వస్తుండడంతో.. ఈ సినిమా ఖచ్చితంగా బ్లాక్ బస్టర్ అవుతుందని భావించారు. కంటెంట్ పై భారీ నమ్మకం. అటు డైరెక్టర్ శంకర్ అందుకే నిడివి కూడా తగ్గించలేదు. పైగా తెలుగు రాష్ట్రాలలో కూడా టికెట్ రేట్లు పెంచుకున్నారు. కానీ భారతీయుడు 2 సినిమాపై శంకర్ పెట్టుకున్న నమకం నిలబడలేదు. కమలహాసన్, సిద్ధార్థ, రకుల్ ప్రీత్ సింగ్ కలిసి నటించిన ఈ సినిమా భారీ డిజాస్టర్ దిశగా దూసుకుపోతోంది.
రిలీజ్ అయిన మొదటి రోజే సినిమాకు నెగిటివ్ టాక్ వచ్చేసింది. దీనికి తోడు రన్ టైం చాలా ఎక్కువగా ఉంది అన్న కంప్లైంట్ వచ్చింది. అందుకే నిర్మాతలు ఆగమేఘాల మీద సినిమాను 20 నిమిషాల పాటు ట్రిమ్ చేశారు. ఆదివారానికి చాలా చోట్ల పెంచిన టికెట్ రేట్లు కూడా తగ్గించేశారు. అయినా సినిమా చూసేందుకు ప్రేక్షకులు థియేటర్లకు రాలేదు. ఫస్ట్ వీకెండ్ ముగియడంతో భారతీయుడు 2 సినిమా ఇక కోలుకోవడం కష్టమని తేలిపోయింది. తెలుగు రాష్ట్రాల్లో భారతీయుడు 2 వసూళ్లు.. ఆక్యుపెన్సీ అయితే పేలవంగా ఉంది.
నైజాం, సీడెడ్, ఉత్తరాంధ్ర మినహాయిస్తే ఎక్కడా కూడా కోటి మార్క్ దాటలేదు ఈ మూవీ. మొన్నటి వరకు గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ చేయాలని ఇప్పటికే సినిమా రిలీజ్ ఆలస్యం అయిందని నానా హంగామా చేసిన మెగా అభిమానులు.. ఇప్పుడు మాట మార్చేశారు. ఇప్పటిలో గేమ్ ఛేంజర్ సినిమా రిలీజ్ చేయవద్దంటూ సోషల్ మీడియా వేదికగా హడావుడి చేస్తున్నారు. దీనికి కారణం భారతీయుడు 2 అతిపెద్ద డిజాస్టర్ కావడమే. ఇక శంకర్ కెరీర్ లోనే చాలా నాసిరకం వర్క్ ఇది అంటూ కోలీవుడ్, టాలీవుడ్ లో టాక్ నడుస్తోంది. ఏది ఏమైనా శంకర్ ఫామ్‌లో లేడని అలాంటి శంకర్‌ను నమ్మి.. రామ్ చరణ్, దిల్ రాజు భారీ బడ్జెట్ తో గేమ్ ఛేంజర్ సినిమా ఎందుకు తీస్తున్నారో ? అర్థం కావటం లేదన్న చర్చలు కూడా నడుస్తున్నాయి.