క్యారెక్టర్ ఆర్టిస్ట్ గా కెరీర్ ప్రారంభించి ఆ తర్వాత హీరోగా ఎదిగిన నటుల్లో నవీన్ పోలిశెట్టి ఒకడు. ఏజెంట్ సాయి శ్రీనివాస ఆత్రేయ, జాతి రత్నాలు, మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి చిత్రాలతో బ్యాక్ టు బ్యాక్ విజయాలు ఖాతాలో వేసుకుంటూ ఫుల్ స్వింగ్ లో దూసుకుపోతున్న తరుణంలో నవీన్ పోలిశెట్టి ఒక్కసారిగా సైలెంట్ అయ్యాడు. అటు ఆన్ స్క్రీన్ పైన కాకుండా ఇటు ఆఫ్ స్క్రీన్ లోనూ కనిపించకుండా మాయమయ్యాడు. గత ఏడాది సెప్టెంబర్ లో మిస్ శెట్టి మిస్టర్ పోలిశెట్టి మూవీ విడుదలై విజయవంతమైంది.
అయితే ఇంత వరకు నవీన్ మరో కొత్త సినిమాను ప్రారంభించలేదు. అయితే నవీన్ పోలిశెట్టి కి అమెరికాలో యాక్సిడెంట్ అయినట్టు మార్చిలో ప్రచారం జరిగింది. కానీ ఈ విషయంపై అతని నుంచి ఎటువంటి స్పష్టత రాలేదు. దీంతో నవీన్ ఏమైపోయాడు..? ఎందుకు సినిమాలు చేయట్లేదు..? అనే ప్రశ్నలు కొద్ది రోజుల సోషల్ మీడియాలో తెగ ట్రెండ్ అవుతున్నాయి. ఈ నేపథ్యంలోనే నవీన్ పోలిశెట్టి స్పందించాడు. తనకు యాక్సిడెంట్ అయిన విషయాన్ని ధృవీకరించాడు. ఈ మేరకు సోషల్ మీడియాలో ఓ నోట్ రిలీజ్ చేశాడు.
నా లైఫ్ అప్‌డేట్‌ను మీతో పంచుకోవాలి అనుకుంటున్నాను. దురదృష్టవశాత్తూ ఓ యాక్సిడెంట్ లో నా కూడి కాలు మరియు చేయికి ఫ్రాక్చర్ అయింది. ప్రస్తుతం భరించలేనంత నొప్పితో బాధపడుతున్నాను. పూర్తిగా కోలుకునే దిశగా కృషి చేస్తున్నాను. కానీ కోలుకునే ప్రక్రియ చాలా నెమ్మదిగా సాగుతోంది. ఇది నాకు ఎంతో కఠినమైన, బాధాకరమైన సమయం. ముఖ్యంగా నేను గాయల వల్ల షూటింగ్స్ కి హాజరు కాలేకపోతున్నాను. వేగంగా మీ ముందుకు సినిమాలు తీసుకురాలేకపోతున్నందుకు నన్ను క్షమించండి అంటూ నవీన్ తన నోట్ లో రాసుకొచ్చాడు.
తాను పూర్తిగా కోలుకునేందుకు కొన్ని నెలలు పడుతుంది. అయితే ఈసారి మీ ముందుకు రెట్టింపు ఎనర్జీతో వస్తాను. గుడ్ న్యూస్ ఏమిటంటే.. నా నెక్స్ట్ ప్రాజెక్ట్‌లు చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతున్నాయి. నేను రికవరీ అయిన వెంటనే షూటింగ్స్ లో జాయిన్ అవుతాను. అలాగే నాపై ఎప్పటిలాగానే మీ ఉండాలని కోరుకుంటున్నాను అని నవీన్ పోలిశెట్టి సోషల్ మీడియా ద్వారా తెలియజేశాడు. మొత్తానికి నవీన్ పోస్ట్ చూస్తుంటే.. ఇప్పట్లో అతను కోలుకోవడం కష్టమనే విషయం స్పష్టమైంది.