టాలీవుడ్ లో కమెడియన్ నుంచి హీరోగా మారిన నటుల్లో ప్రియదర్శి పులికొండ ఒకడు. టెర్రర్ మూవీ తో సినీ పరిశ్రమలోకి అడుగు పెట్టిన ప్రియదర్శి పెళ్లిచూపులు చిత్రంతో గుర్తింపు సంపాదించుకున్నాడు. ఆ తర్వాత వరుస సినిమాలు చేస్తూ అనతి కాలంలోనే స్టార్ కమెడియన్ గా ముద్ర వేయించుకున్నాడు. 2019లో మల్లేశం మూవీతో హీరోగా మారిన ప్రియదర్శి.. 20023లో బలగం చిత్రంతో బిగ్ హిట్ అందుకున్నాడు.
సేవ్ ది టైగర్స్ వెబ్ సిరీస్ ద్వారా ప్రియదర్శి క్రేజ్ మరింత పెరిగిపోయింది. ప్రస్తుతం అతన్ని హీరోగా పెట్టి సినిమాలు చేసేందుకు నిర్మాతలు పోటీ పడుతున్నారు. త్వరలోనే డార్లింగ్ అనే రొమాంటిక్ అండ్ ఫన్ ఎంటర్టైనర్ తో ప్రియదర్శి ప్రేక్షకులను పలకరించబోతున్నాడు. హనుమాన్ వంటి పాన్ ఇండియా సక్సెస్‌ఫుల్ మూవీ తర్వాత ప్రైమ్‌షో ఎంటర్‌టైన్‌మెంట్ సంస్థ నుంచి వస్తున్న చిత్రమిది. నభా నటేష్ హీరోయిన్ గా యాక్ట్ చేసింది. జూలై 19న డార్లింగ్ విడుదల కానున్న నేపథ్యంలో ప్రియదర్శి బ్యాక్ టు బ్యాక్ ఇంటర్వ్యూస్‌లో పాల్గొంటున్నాడు.
ఇక సినిమాల గురించి కాసేపు పక్కన పెడితే.. ప్రియదర్శి నటుడిగా ముఖ పరిచయమే తప్పా అతని ఫ్యామిలీ విశేషాల గురించి ఎవరికీ పెద్దగా తెలియదు. తెలంగాణలోని తెలుగు కుటుంబంలో ప్రియదర్శి జన్మించాడు. అతని స్వగ్రామం ఖమ్మంజిల్లా మధిర మండలం మర్లపాడు. ప్రియదర్శి తండ్రి పులికొండ సుబ్బాచారి ప్రొఫెసర్ మరియు జానపద సాహిత్య రంగంలో పేరు పొందిన పరిశోధకుడు. తెలంగాణ జీవిత నేపథ్యంలో మాదిగ కొలుపు, రేవు తిరగబడితే పేర్లతో రెండు నవలలు రాశారు. కవిగా మూడు కవితా సంపుటాలు ప్రచురించారు. అలాగే ప్రియదర్శి తల్లి జయలక్ష్మి ఉపాధ్యాయురాలుగా పనిచేసి వాలంటరీ రిటైర్‌మెంట్ తీసుకున్నారు.
ప్రియదర్శి తాతగారు పులికొండ పిచ్చయాచారి రజాకార్ వ్యతిరేక ఉద్యమం జరిగే రోజుల్లో నాటక దళంలో పనిచేశారు. వందల నాటక ప్రదర్శనలు ఇచ్చారు. ప్రియదర్శికి ఒక చెల్లెలు ఉంది. ఆమె నేవీలో లెఫ్టినెంట్ కమాండర్ గా వర్క్ చేస్తున్నారు. ప్రియదర్శి 2018లో రిచా శర్మను వివాహం చేసుకున్నాడు. ఆగ్రా సమీపంలో బృందావనంకు చెందిన రిచా శర్మ ఒక రచయిత్రి మరియు కాలేజీలో ప్రియదర్శి సీనియర్. ఇక ప్రియదర్శి విషయానికి వస్తే.. హైదరాబాద్ విశ్వవిద్యాలయం నుండి మాస్ కమ్యూనికేషన్‌లో పోస్ట్ గ్రాడ్యుయేట్ డిగ్రీ చేశాడు. చిన్నతనం నుంచి సినిమాలపై ఉన్న ఆసక్తితో అతను ఇండస్ట్రీ వైపు అడుగులు వేశాడు. చిన్న స్థాయి నటుడి నుంచి హీరో స్థాయికి ఎదిగాడు.