తెలుగు సినిమాల్లోనేకాదు.. యావత్ భారత దేశంలోని 18 గుర్తించిన భాషల్లో పాటలు పాటి.. గిన్నిస్‌బుక్ రికార్డును సొంతం చేసుకున్న గానగంధర్వుడు.. బాలసుబ్రహ్మణ్యం. ఈయన ఎదిగిన తీరు అందరికీ ఒక లెస్సనే. నెల్లూరు జిల్లాకు చెందిన ఈయన చాలా కష్టాలు పడి.. సినిమా రంగంపై ఆసక్తితో ముందుకు సాగారు. పైగా.. ఇప్పట్లో మాదిరిగా.. సంగీత దర్శకులు.. ఎవరు వచ్చినా ప్రోత్సహించి.. పాటలు పాడించే పరిస్థితి లేదు.
ఘంటసాల వెంకటేశ్వరరావు వంటి దిగ్గజ గాయకులు ఉన్నారు. అదేసమయంలో ఏఎం రాజా, పిఠాపురం నాగేశ్వరరావు వంటి వారు కూడా.. గాయకులుగా కొనసాగుతున్నారు. ఇంత పెద్ద సంగీత సామ్రాజ్యంలో ఘంటసాల అంటేనే.. సంగీత దర్శకులు ముందుకు వచ్చేవారు. అలాంటి రోజుల్లో ఇండస్ట్రీ మెట్లెక్కిన.. బాలుకు.. తొలిసారి అవకాశం ఇచ్చింది.. పద్మనాభం. నిజానికి ఈయన కూడా.. చేతిలో రూపాయి లేని పరిస్థితిలో ఇండస్ట్రీలోకి వచ్చి.. ఎదిగారు.
పద్మనాభం.. అప్పటికే కోటీశ్వరుడు.. అయ్యారనే టాక్ ఉంది. దీంతో ఆయన సొంత బ్యానర్ పెట్టుకుని.. సినిమాలు చేసేవారు. తనే హీరోగా సినిమాలు వచ్చాయి. ఇలా.. వచ్చిన సినిమానే ‘శ్రీశ్రీశ్రీ మర్యాద రామన్న’. ఈ సినిమాలో కొత్తవారికి అవకాశాలు కల్పించారు. ఈ క్రమంలోనే నటులేకాదు.. గాయకులు కూడా.. కొత్తవారికే అవకాశం ఇవ్వాలని భావించిన పద్మనాభం.. ఇదే పని చేశారు. అయితే.. ఎక్కడా కూడా. కొత్తవారనే చులకన ఆయన ప్రదర్శించలేదు.
సాధారణంగా.. ఎవరైనా కొత్త అంటే.. రెమ్యునరేషన్ కూడా ఇచ్చే రోజులు కావవి. ఏదో కడుపు నిండా తిండి పెట్టి పది రూపాయలు చేతిలో పెట్టేవారు.. అలాంటి రోజుల్లోనే పద్మనాభం.. బాలును సినిమాలో పాటలకు పెట్టుకుని ఏకంగా రూ.300 రెమ్యురేషన్ ఇచ్చారు. ఆ రోజుల్లో ఘంటసాలగారు 500 రూపాయలు తీసుకునే వారు. అలాంటిరోజుల్లో అంత గౌరవంగా చూసుకున్న పద్మనాభం.. ఎంత ఎదిగినా.. ఒదిగి ఉండాలని చెప్పేవారట. అంతేకాదు.. నిరంతర శిక్షణతో ఎన్నిమెట్లయినా.. ఎక్కొచ్చని చెప్పేవారట. ఇదే తర్వాత.. కాలంలో బాలుకు ఉపయోగపడింది. ఆయన 1990లలోనే తన పాటకు 3 లక్షలు తీసుకున్నారు.