సినిమా మార్కెట్ పెరిగే కొద్దీ సినీ తారల రెమ్యునరేషన్ కూడా పెరుగుతూ వచ్చింది. మన టాలీవుడ్ లో చూసుకుంటే కొందరు హీరోలు రూ. 100 కోట్లకు పైగా కూడా రెమ్యునరేషన్ ఛార్జ్ చేస్తున్నారు. హీరోలంతా కాకపోయినా హీరోయిన్లకు కూడా నిర్మాతలు బాగానే డబ్బులు ఇస్తున్నారు. మంచి ఫామ్ లో ఉన్న టాప్ హీరోయిన్లు రూ. 5 నుంచి 10 కోట్ల రేంజ్ లో పారితోషికం అందుకుంటున్నారు. కుర్ర హీరోయిన్లు కోటి రూపాయలు చొప్పున తీసుకుంటున్నారు.
అయితే టాలీవుడ్ లో కోటి రూపాయలు రెమ్యునరేషన్ తీసుకున్న తొలి హీరోయిన్ ఎవరు అని అడిగితే.. ఎక్కువ శాతం మంది శ్రీదేవి పేరు చెప్తారు. కానీ అది కరెక్ట్ కాదు. ఇండియన్ ఫిల్మ్ ఇండస్ట్రీలో మొదటిసారి కోటి రూపాయలు తీసుకున్న హీరోయిన్ శ్రీదేవినే. ఆమె ఒక బాలీవుడ్ సినిమాకు అంత మొత్తం అందుకుంది. ఇక తెలుగులో కోటి రూపాయలు పారితోషికం అందుకున్న తొలి హీరోయిన్ మాత్రం గోవా బ్యూటీ ఇలియానా. 2006లో దేవదాసు సినిమాతో టాలీవుడ్ లోకి హీరోయిన్ గా అడుగుపెట్టిన ఇలియానా.. ఫస్ట్ మూవీతోనే హిట్ అందుకుంది.
అదే ఏడాది మహేష్ బాబుకు జోడిగా పోకిరి సినిమాలో నటించి ఇండస్ట్రీ హిట్ ను ఖాతాలో వేసుకుంది. రెండో సినిమాకే ఇలియానా భారీ స్టార్డమ్ సొంతం చేసుకుంది. జీరో సైజ్ కారణంగా ఆమె మరింత పాపులర్ అయింది. సినిమా ఆఫర్లు వేలువెత్తాయి. ఈ నేపథ్యంలోనే ఇలియానా తన మూడో చిత్రం ఖతర్నాక్ కోసం కోటి రూపాయలు రెమ్యునరేషన్ డిమాండ్ చేసిందట. ఆమె అంత అడిగేసరికి నిర్మాతలు మొదట షాక్ అయినా కూడా ఇలియానా క్రేజ్ ను దృష్టిలో ఉంచుకొని కోటి రూపాయలు రెమ్యూనరేషన్ ఇచ్చేశారు.
అయితే రవితేజ, ఇలియానా జంటగా నటించిన ఖతర్నాక్ చిత్రం పరాజయం పాలయ్యింది. అయినా సరే ఇలియానా క్రేజ్ మాత్రం తగ్గలేదు. ఆ తర్వాత వరుస సినిమాలతో ఆమె తన కెరీర్ ను పరుగులు పట్టించింది. టాలీవుడ్ లో సంపాదించుకున్న నేమ్ అండ్ ఫేమ్ తో తమిళంలోనూ అవకాశాలు అందిపుచ్చుకుంది. 2013 నుంచి బాలీవుడ్ పై దృష్టి పట్టింది. కానీ అక్కడ అనుకున్న స్థాయిలో సక్సెస్ కాలేక పోయింది. ప్రస్తుతం సౌత్ లో ఆమెకు సినిమాల్లేవు. బాలీవుడ్ లో వచ్చిన చిన్నా చితక ఆఫర్లతో ఇలియానా కెరీర్ ను నెట్టుకొస్తుంది.