విదేశాల్లో సినిమా షూటింగ్ అంటే ప్రస్తుత రోజుల్లో చాలా కామన్ అయిపోయింది. సహజత్వం కోసం కోట్లకు కోట్లు ఖర్చు పెట్టి రియల్ లోకేషన్స్ లోనే షూటింగ్ చేస్తున్నారు. స్టార్ హీరోలు, మీడియం రేంజ్ హీరోల సినిమాల్లో సాంగ్స్ ను ఆల్మోస్ట్ విదేశాల్లోనే షూట్ చేస్తున్నారు. కథ డిమాండ్ చేస్తే యువ హీరోల సినిమాలను కూడా ఫారెన్ కంట్రీస్ లో చిత్రీకరించేందుకు నిర్మాతలు ఏ మాత్రం వెనకాడటం లేదు.
కానీ నాలుగు దశాబ్దాల క్రితం సినిమా షూటింగ్స్ అంటే కేవలం స్టూడియోల్లోనే జరిగేవి. కావాల్సిన విధంగా స్టూడియో లోనే సెట్టింగ్ వేసుకుని షూటింగ్ జరిపేవారు. విదేశాల్లో షూటింగ్ అంటే నిర్మాతలు అస్సలు డేర్ చేసేవారు కాదు. ఎందుకంటే, అది ఎంతో ఖర్చుతో కూడుకున్న పని. అలాంటి రోజుల్లో విదేశాల్లో షూటింగ్ జరుపుకున్న తొలి తెలుగు సినిమా ఏదో తెలుసా.. హరే కృష్ణ హలో రాధ.
సి.వి.శ్రీధర్ డైరెక్ట్ చేసిన ఈ చిత్రంలో సూపర్ స్టార్ కృష్ణ హీరోగా నటించగా.. ఆయనకు జోడిగా శ్రీప్రియ హీరోయిన్ గా చేసింది. రతి అగ్నిహోత్రి, కైకాల సత్యనారాయణ, సత్తార్, ప్రకాష్ తదితరులు ఇతర ముఖ్యమైన పాత్రలను పోషించారు. శ్రీ భరణీ చిత్ర ఎంటర్‌ప్రైజెస్ బ్యానర్ పై ఏకకాలంలో తెలుగు, తమిళ భాషల్లో ఈ సినిమాను నిర్మించారు. తెలుగు వెర్షన్ లో కృష్ణ, తమిళ వెర్షన్ శివ చంద్రన్ హీరోలుగా నటించారు.
అయితే హరే కృష్ణ హలో రాధలో ఒక పాట, కొన్ని సన్నివేశాలు మినహా మూడొంతులు చిత్రాన్ని అమెరికాలో చిత్రీకరించడం విశేషం. ఈ సినిమా తాను నటించక పోయినప్పటికీ కృష్ణతో పాటు అమెరికాకు విజయనిర్మల కూడా వెళ్లారు. వంటల్లో స్పెషలిస్టు అయిన విజయనిర్మల.. అమెరికాలో ఉన్నన్ని రోజులు చిత్రయూనిట్ మొత్తానికి వండి పెట్టారు. ఫుడ్ విషయంలో యూనిట్ కి ఎటువంటి ఇబ్బంది లేకుండా చూసుకున్నారు. ఇక 1980 అక్టోబర్ 16న హరే కృష్ణ హలో రాధ విడుదలైంది.